- కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం
- ఐఎన్‌టీయూసీ ద్వారా జల మండలిలో కాంగ్రెస్ జెండా ఎగరవేశామని వెల్లడి
- మంత్రులు వివేక్, పొన్నం, పీసీసీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థి రాజిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డికి ఆదివారం గాంధీ భవన్‌లో అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు ఖైరతాబాద్‌లోని జల మండలి ఆఫీస్ నుంచి గాంధీ భవన్‌కు రాజిరెడ్డి ర్యాలీగా వచ్చారు.
అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రాజిరెడ్డిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. జల మండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పాల్గొని, తెలంగాణ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్‌కు ఓటు వేసి గెలిపించిన కార్మికులందరికి అభినందనలు తెలిపారు. ఐఎన్‌టీయూసీ ద్వారా కాంగ్రెస్ జెండాను ఎగరేశామన్నారు. అలాగే, హైదరాబాద్‌లో జరగనున్న మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా ఐఎన్‌టీయూసీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం స్పందించలేదని, కానీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూడ్రోజుల్లోనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారని పేర్కొన్నారు. సింగరేణి, జలమండలి వంటి సంస్థలను బీఆర్‌ఎస్ నాయకులు తమ గుప్పిట్లో పెట్టుకొని కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ముఖ్యంగా, జల మండలిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధిపత్యం కొనసాగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని, తమ నాయకులను ఎన్నుకున్నారని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మహేశ్ గౌడ్ హామీ ఇచ్చారు. కార్మికుల కష్టసుఖాల్లో అండగా నిలవాలని రాజిరెడ్డి బృందానికి సూచించారు. ఈ ఎన్నికల్లో సాధించిన విజయం కార్మికుల ఆత్మగౌరవానికి, కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
జల మండలిలో పన్నేండేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఐఎన్‌టీయూసీ అనుబంధ కార్మిక సంఘం(తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్)ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు తనకు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ఇన్‌చార్జి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్‌డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
