హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి
కోహెడ (హుస్నాబాద్) వెలుగు : బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టే తనను కాంగ్రెస్ పార్టీలో తొక్కేస్తున్నారని, దీనిపై గాంధీ భవన్ లో కూడా చర్చ జరుగుతోందని హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. రాష్ట్ర అధినాయకత్వం తనతో మాట్లాడటానికి రెండు నిముషాలు కూడా ఇవ్వడం లేదన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో కేవలం ఒక వర్గం వారికే టికెట్లు ఇస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. అధిష్టానం తనను పొమ్మనలేక పొగ పెడుతోందన్నారు.
బలహీన వర్గాలను ప్రోత్సహించే పార్టీలు చాలానే ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి చేరిక గురించి కనీసం తమతో చర్చించలేదన్నారు. ఎవరు లేని టైంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవీణ్‌ను ఢిల్లీకి తీసుకువెళ్లి చేర్పించాడన్నారు. 50 ఏండ్లు తన తండ్రి, 20 ఏండ్లుగా తాను పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, ఇప్పుడు వేరెవరికో లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు వంగర మల్లేశం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బస్వరాజు శంకర్, మండల అధ్యక్షుడు చందు, అయిలయ్య, ధర్మయ్య పాల్గొన్నారు.

