V6 News

ప్రతిపక్ష సభ్యులపై నేరుగా విమర్శలు..మోదీపై కాంగ్రెస్‌‌ ప్రివిలేజ్ నోటీసు

ప్రతిపక్ష సభ్యులపై నేరుగా విమర్శలు..మోదీపై కాంగ్రెస్‌‌ ప్రివిలేజ్ నోటీసు

స్పీకర్‌‌‌‌ ఓంబిర్లాకు ఇచ్చిన సీనియర్‌‌‌‌ నేత కేసీ వేణుగోపాల్​
ఏప్రిల్ 18న చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష ఎంపీలపై మోదీ నిందారోపణలు 
ప్రతిపక్ష సభ్యుల ఓటింగ్ సరళిపై నేరుగా విమర్శలు
ఇది భారత ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు అవమానమని కామెంట్​

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ నోటీసు (సభా హక్కుల ఉల్లంఘన నోటీసు) ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మంగళవారం లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. అలాగే, స్పీకర్‌‌‌‌‌‌‌‌కు లేఖ కూడా రాశారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో ఎంపీల పట్ల నిందారోపణలు చేశారని పేర్కొన్నారు. ‘‘లోక్‌‌‌‌సభ నియమావళిలోని రూల్ 222 నిబంధనల ప్రకారం.. భారత ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాను. 

2026 ఏప్రిల్ 18న టెలికాస్ట్ అయిన ప్రసంగంలో ఆయన లోక్‌‌‌‌సభ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు  చేశారు” అని తెలిపారు. ఆ ప్రసంగానికి దారితీసిన పరిస్థితులను వేణుగోపాల్‌‌‌‌ ప్రస్తావించారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో, ఏప్రిల్ 17న లోక్‌‌‌‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు–2026 వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న ప్రధాని మోదీ జాతీయ టెలివిజన్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 

సుమారు 29 నిమిషాల పాటు సాగిన ఆ ప్రసంగంలో, బిల్లును అడ్డుకున్నందుకు ప్రతిపక్ష పార్టీలను ప్రధాని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల ఓటింగ్ సరళిని నేరుగా ప్రస్తావిస్తూ.. వారికి దురుద్దేశాలను ఆపాదించారు” అని ఆరోపించారు.  ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు ఉన్న స్వతంత్ర అధికారాన్ని ప్రధాని ప్రశ్నించారని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రశ్నించడమనేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. ఇది పార్లమెంట్ అధికారానికి, భారత ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు ప్రత్యక్ష అవమానం అని పేర్కొన్నారు.

మోదీపై చర్యలు తీసుకోవాలి 

పార్లమెంట్ పవిత్రతను, ఎంపీల రాజ్యాంగ హక్కులను కాపాడటానికి స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఓంబిర్లా  నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేసీ వేణుగోపాల్​ కోరారు. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సభా హక్కుల ఉల్లంఘనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పార్లమెంట్‌‌‌‌లో ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ లభించలేదనే కారణంతోనే ప్రతిపక్ష పార్టీలను ప్రధాని మోదీ విమర్శించారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల సాకుతో డీలిమిటేషన్‌‌‌‌ విషయంలో రాజ్యాంగ రక్షణలను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని, అందుకే  బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని స్పష్టం చేశారు. 

జైరాం రమేశ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌

ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌‌‌‌ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ప్రధాని మోదీ తన దుష్ట వ్యూహాలను అమలు చేయాలనుకున్నారు. కానీ ప్రతిపక్షాల ఐక్యత ముందు అవి ఫలించలేదు. ఆ అసహనంతోనే ఆయన దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై 59 సార్లు మాటలతో దాడి చేశారు”అని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.