అవసరమైతే సీతక్కే సీఎం.. ఎన్‌ఆర్‌‌ఐల భేటీలో రేవంత్ రెడ్డి

అవసరమైతే సీతక్కే సీఎం..  ఎన్‌ఆర్‌‌ఐల భేటీలో రేవంత్ రెడ్డి
  • తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి.. మనలో మనం కొట్టుకోకూడదని సూచన
  • దళితులు, ఓబీసీలు, మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం ఉందని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అవుతారేమోనని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, ఓబీసీలు, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, అందులో 3 రాష్ట్రాలకు ఓబీసీలే సీఎంలుగా ఉన్నారని తెలిపారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రేవంత్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్కతో కలిసి సోమవారం అక్కడి ఎన్‌ఆర్‌‌ఐలతో సమావేశమై, మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడాలి తప్పితే, మనలో మనం కొట్టుకోకూడదని సూచించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌‌ఐలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇచ్చారు. 

రాజకీయాల్లో దళితులు, ఆదివాసీలకు సముచిత స్థానం దక్కడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలని ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు కోరారు. ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటించాలని వారు డిమాండ్‌‌ చేశారు. దీనిపై స్పందించిన రేవంత్‌‌.. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్‌‌లో లేదని చెప్పారు. సీతక్క విషయంలోనూ ఏదైనా జరగొచ్చన్నారు. ‘డిప్యూటీ సీఎం కాదు.. అవసరమైతే సీతక్కే సీఎం అవుతారు’అని రేవంత్ వ్యాఖ్యానించగా, సమావేశంలో పాల్గొన్న వాళ్లంత విజిల్స్‌‌, చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న వాళ్లలో అధిక శాతం ఓసీలే ఉంటున్నారని ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు రేవంత్‌‌ దృష్టికి తీసుకొచ్చారు. విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎలాంటి సాయం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫారిన్ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉండబోతున్నదని ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు అడిగినప్పటికీ, రేవంత్ సమాధానం దాటవేశారు.