కాంగ్రెస్‌ని గెలిపిస్తే 600 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ

కాంగ్రెస్‌ని గెలిపిస్తే 600 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడే వరాలు కురిపిస్తోంది. ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర శాసనసభ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలోని వాజిర్‌పూర్‌లో నిర్వహించిన సభలో ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా కరెంట్ ఫ్రీ అంటూ ప్రకటించారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారని, అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే 600 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని తాను ఈ మాట చెప్పడం లేదన్నారు. ప్రజల డబ్బు ప్రజలకే అందాలని అన్నారు సుభాష్ చోప్రా. అలాగే చిన్న చిన్న షాపులు నడుపుకునేవాళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కమర్షియల్ చార్జీలు రద్దు చేస్తామని చెప్పారాయన.

కాంగ్రెస్ హామీపై సీఎం కేజ్రీవాల్ సవాల్

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా ఇచ్చిన హామీపై సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ పార్టీ చేస్తున్న మంచి పనుల బాటలోకి మిగితా పార్టీలు కూడా రావడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. అయితే కాంగ్రెస్ హామీలో నిజాయితీ ఉంటే ముందుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు కేజ్రీవాల్. అలా చేయకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు భావించాల్సి వస్తుందని అన్నారు.