- రాహుల్ గాంధీతో భేటీలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- పార్టీ పోస్టుల నియామకాలపై అగ్రనేతతో కీలక చర్చలు
- హైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ మీటింగ్ నిర్వహించాలని రిక్వెస్ట్
- శాస్త్రీయంగా కుల సర్వే చేసి ఓబీసీ లెక్కలు తేల్చినట్లు మహేశ్ గౌడ్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగానే పీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతో పాటు, వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై అగ్రనేత రాహుల్ గాంధీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు.
ఈ నియామకాల ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీలోని 10 జన్ పథ్‌లో లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతో పాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ దిశలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏఐసీసీ ఓబీసీ మీటింగ్ నిర్వహించండి
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే ఏఐసీసీ నేషనల్ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సాధికారత పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అగ్రనేతకు తెలిపారు.
అలాగే తెలంగాణ వేదికగా బీసీ ఐక్యతకు మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. మహిళ రిజర్వేషన్లలో ఓబీసీ కోటా అంశాన్ని జోడించాలని... తద్వారా బీసీ రిజర్వేషన్లు అంశాన్ని ప్రస్తావించాలని రాహుల్ ను కోరినట్లు తెలిపారు.
రాహుల్‌తో అనిల్‌కుమార్ భేటీ..
అంతకు ముందుకు రాహుల్ గాంధీని రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తన కుటుంబం సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం కుల గణనను అత్యంత విజయవంతంగా, శాస్త్రీయంగా పూర్తి చేసిందన్నారు. ఈ ‘తెలంగాణ మోడల్’ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాహుల్‌ను కోరినట్లు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మాజీ ఎంపీ వీహెచ్ సైతం రాహుల్ ను కలిశారు.
కేసీఆర్ మాదిరి ఒక్కరోజు సర్వే కాదు..
గత బీఆర్‌ఎస్ సర్కార్ హయంలో కేసీఆర్ చేసిన ఒక్క రోజు సర్వే కాదని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయంగా కుల గణన చేసిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి లోపం జరగలేదన్నారు. అత్యంత శాస్త్రీయ పద్ధతిలో స్పష్టమైన వివరాల నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారని గుర్తు చేశారు.
ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామన్నారు. తద్వారా సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

