- కిడ్నీ జబ్బులకు ఊర్లలో సగటున రూ.76 వేల ఖర్చు
- పట్టణాల్లో భారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్
- ఇందుకోసం రూ.1.04 లక్షల వ్యయం
- 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకర అంశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఏదైనా బీమార్ వస్తే.. జేబులు గుల్లయిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో విచ్చలవిడి ఫీజులతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఖరీదైపోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. సగటున ఏడాదికి ఒక్కో వ్యక్తి ఆస్పత్రి ఖర్చులు రూ.52,743 గా ఉన్నట్లు తేలింది. సగటు ఖర్చు రూ.50 వేలు దాటిన ఏకైక రాష్ట్రం మనదే కావడం ఆందోళన కలిగిస్తున్నది.
ఊర్లలో కిడ్నీ జబ్బులకు.. పట్టణాల్లో క్యాన్సర్కు ఎక్కువ ఖర్చు..
దేశవ్యాప్తంగా వివిధ జబ్బులకూ భారీగానే ఖర్చువుతోంది. ఊర్లలో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం సగటున రూ.76 వేలు ఖర్చు పెడుతున్నారు. మిగతా జబ్బులతో పోలిస్తే దానికే ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్కు రూ.62,588, గుండె జబ్బులకు రూ.47,135, ప్రమాదాల్లో గాయపడితే రూ.46,801, కండరాలు ,కీళ్ల నొప్పులకు రూ.45,264, నరాల సమస్యలకు రూ.43,155 చొప్పున ఖర్చు పెడుతున్నారు.
అదే పట్టణాల్లో మాత్రం క్యాన్సర్కు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. ఇందుకు సగటున రూ.1,04,424 ఖర్చవుతోంది. ఆ తర్వాత కీళ్ల నొప్పులకు రూ.76,106, కిడ్నీ సమస్యలకు రూ.71,246, గుండె జబ్బులకు రూ.69,451, నరాల సమస్యలకు రూ.62,751 చొప్పున డబ్బులు ఖర్చవుతున్నట్టు నివేదిక తేల్చింది.

