V6 News

తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ అధ్యాయం ముగిసింది: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ అధ్యాయం ముగిసింది: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ అధ్యాయం ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రాబల్యంతో ఇబ్బంది పడ్డ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని.. ఇక మనకు AK-47ల అవసరం లేదని ఆయన అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త పోలీస్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు,పోలీసు వ్యవస్థలో రాబోయే మార్పులపై డీజీపీ మాట్లాడారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే రౌడీలకు, గుండాలకు కాదు.. అది కేవలం సామాన్య ప్రజల కోసమేనని ఆయన తేల్చి చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. నేరస్తుల పట్ల కఠినంగా ఉంటూనే, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ క్రైమ్,గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తో పాటు, మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 1995లో తాను రుద్రంగికి వచ్చినప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. నేడు జరుగుతున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.

రోడ్డు భద్రతపై డీజీపీ కీలక సూచనలు చేశారు. నేను వచ్చేటప్పుడు చూశాను, ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. రోడ్డుపై ఎవరైనా సమానమే.. హెల్మెట్ ధరించడం మీ కుటుంబం కోసమేనని' ఆయన గుర్తుచేశారు. కార్లలో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టుదల కలిగిన వ్యక్తి అని, అటువంటి ప్రోగ్రెసివ్ నాయకుడు ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని డీజీపీ కొనియాడారు.