ఢిల్లీ నుంచి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇక బుల్లెట్ వేగంతో వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి. ఢిల్లీ-వారణాసి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నోయిడా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై పనులు స్పీడ్ అందుకున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతుండటంతో.. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు గ్రౌండ్ లెవల్ పనులపై ఫోకస్ పెట్టారు.
కేవలం 21 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌కు..
ఢిల్లీ నుంచి నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న సుమారు 62 కిలోమీటర్ల దూరాన్ని ఈ హైస్పీడ్ రైలు జస్ట్ 21 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాసులకు ఇది అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జాంల మధ్య గంటల తరబడి ప్రయాణించే అవసరం లేకుండా.. నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు ఈ సదుపాయంతో.
నోయిడాలో రెండు కీలక స్టేషన్లు..
ఈ కారిడార్‌లో భాగంగా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో రెండు ప్రధాన స్టేషన్లను ప్రతిపాదించారు. ఒకటి నోయిడా సెక్టార్ 148లో కాగా.. రెండోది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టేషన్. ఈ స్టేషన్ విమానాశ్రయంలోని గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్‌తో నేరుగా కనెక్టన్ ఉంటుంది. స్పెషాలిటీ ఏంటంటే.. ఎయిర్‌పోర్ట్ లోపల ఈ స్టేషన్ అండర్ గ్రౌండ్‌లో ఉండబోతోంది.
మొత్తం 800 కిలోమీటర్ల పొడవున్న ఈ ఢిల్లీ-వారణాసి హైస్పీడ్ కారిడార్ కేవలం నోయిడాకే పరిమితం కాకుండా మథుర, ఆగ్రా, ఇటావా, లక్నో, రాయ్‌బరేలీ, ప్రయాగ్‌రాజ్, భదోహీ జిల్లాల గుండా సాగనుంది. ప్రస్తుతం నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు నేరుగా రైలు కనెక్టివిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలనే మార్చేయనుంది.
ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీ అధికారులతో NHSRCL మీటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న గ్యాస్ పైప్‌లైన్లు, వాటర్ లైన్లు, విద్యుత్ లైన్ల వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై తదుపరి చర్చల కోసం ఆగ్రాలో కూడా అధికారులు సమావేశం కానున్నారు. మొత్తానికి హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే.. యూపీలోని నోయిడా రీజియన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ కలిగిన ప్రాంతంగా అవతరిస్తుంది.

