బీజేపీకి బిగ్ షాక్.. దాతియా బై పోల్‎లో ఎగిరిన కాంగ్రెస్‌‌ జెండా 

బీజేపీకి బిగ్ షాక్.. దాతియా బై పోల్‎లో ఎగిరిన కాంగ్రెస్‌‌ జెండా 

భోపాల్‌‌: మధ్యప్రదేశ్‌‌లోని దాతియా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ పార్టీ జెండా ఎగరేసింది. కాంగ్రెస్‌‌ అభ్యర్థి ఘనశ్యామ్‌‌ సింగ్‌‌ 6,016 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆశుతోష్‌‌ తివారీపై గెలుపొందారు. ఘనశ్యామ్‌‌ సింగ్‌‌కు 66,757 ఓట్లు రాగా, ఆశుతోష్‌‌ తివారీకి 60,741 ఓట్లు లభించాయి. ఈ విజయంతో రాష్ట్ర కాంగ్రెస్‌‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బ్యాంకు మోసం కేసులో కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే రాజేంద్ర దోషిగా తేలడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. 

దీంతో దాతియా అసెంబ్లీ సెగ్మెంట్‌‌కు ఉప ఎన్నిక నిర్వహించారు. సోమవారం ఫలితం రావడంతో భోపాల్‌‌లోని కాంగ్రెస్‌‌ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు జితేంద్ర పట్వారీ మాట్లాడుతూ.. దాతియా ప్రజలు బీజేపీ ప్రభుత్వ అహంకారానికి, అవినీతికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ విజయాన్ని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు ఘనశ్యామ్‌‌ సింగ్‌‌ ప్రకటించారు. ఓటమిపై స్పందించిన బీజేపీ అభ్యర్థి ఆశుతోష్‌‌ తివారీ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.

నరోత్తమ్‌‌ మిశ్రా కంచుకోటలో కమలానికి షాక్‌‌

దాతియా నియోజకవర్గం చాలా ఏండ్లుగా బీజేపీ సీనియర్‌‌ నేత, మాజీ హోంమంత్రి నరోత్తమ్‌‌ మిశ్రాకు కంచుకోటగా ఉంది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఆయన ప్లేస్‌‌లో ఆశుతోష్‌‌ తివారీని నిలబెట్టింది. నరోత్తమ్‌‌ మిశ్రా ప్రచారం చేసినప్పటికీ పార్టీ విజయాన్ని సాధించలేకపోయింది. కొద్దిరోజుల కింద షియోపూర్‌‌‌‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా బీజేపీ ఓటమిపాలైంది. దీంతో ముఖ్యమంత్రి మోహన్‌‌ యాదవ్‌‌ నాయకత్వంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.