సికింద్రాబాద్, వెలుగు: ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టు యాదాద్రి వరకు పొడిగింపుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ గురువారం అధికారులతో సమీక్షించారు. యాదాద్రి రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేసి, ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్ పొడిగింపులో తూర్పు వైపు కొత్త స్టేషన్ బల్డింగ్ రానుండగా.. "అమృత్ భారత్" స్టేషన్ స్కీమ్‌లో భాగంగా పశ్చిమ వైపు స్టేషన్‌ను కూడా డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్ కు ఇప్పటికే టెండర్లు జరిగాయని,స్టేషన్ అప్‌గ్రేడేషన్ చేపట్టాల్సి ఉందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్వెల్లడించారు. 2016-17లో రూ. 330 కోట్ల అంచనాతో ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ఫేజ్ –2 పొడిగింపు మంజూరు చేశారు.
ప్రస్తుతం ఘట్‌కేసర్ , యాదాద్రి ( రాయగిరి ) మధ్య 33 కి.మీ దూరం వరకు రెండు లైన్లు ఉండగా.. అదనంగా మరో ట్రాక్ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఘట్‌కేసర్ , బీబీనగర్ , భువనగిరి , యాదాద్రి స్టేషన్లలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మొదట రైల్వేలు , ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్‌గా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కోసం సవరించిన అంచనా సుమారు రూ. 430 కోట్లకు పెరిగింది. దీంతో అందుకనుగుణంగా రైల్వే బోర్డు 100శాతం నిధులతో ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది. ఆయన వెంట రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, మున్నా కుమార్ , సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్, ఏకే గుప్తా ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

