- వ్యవసాయ భూముల విలువ రెండు, మూడు రెట్లు పెరిగే చాన్స్
- అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ధరల్లో కొద్దిమేర సవరింపు
- ఇప్పటికే ఎక్కువగా ఉన్న చోట తగ్గింపు
- కేబినెట్ సబ్ కమిటీకి సవరించిన మార్కెట్ వ్యాల్యూ నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్వ్యాల్యూ భారీగా పెరగనుంది. వచ్చే నెలలో లేదంటే జూన్లో పెరిగిన మార్కెట్ వ్యాల్యూను అమల్లోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం కాగా.. రిసోర్స్ మొబిలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసిన తరువాత కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు భూముల విలువను పెంచలేదు.
ఇప్పుడు మొదటిసారి మార్కెట్ వ్యాల్యూను సవరించనున్నారు. స్టాంప్‌డ్యూటీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ భూముల మార్కెట్ వ్యాల్యూ గరిష్టంగా రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ప్లాట్ల విలువ కూడా మూడింతలు పెరిగే చాన్స్ ఉంది. అలాగే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ కొద్దిమేర పెరగనుండగా, కమర్షియల్స్పేస్రేట్లు మాత్రం తగ్గనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షల మార్కెట్ వ్యాల్యూ ఉన్న భూమి విలువ రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ వ్యాల్యూ రూ. 20 లక్షలు ఉండగా, దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతున్నది. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 300 శాతానికి పైగా పెరగనున్నాయి. దీంతో సర్కార్‌కు ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్‌లో అసమానతలు తగ్గుతాయని భావిస్తున్నది. నిజానికి పోయినేడాది జూన్‌లోనే భూముల విలువలు సవరించాలని ప్రభుత్వం అనుకున్నది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాపడింది.
ఓఆర్ఆర్ వరకు మరింత ఫోకస్..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిసరాల్లోని నివాస స్థలాల విలువలు భారీగా పెరగనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల రేట్లు గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు పెరగనున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రస్తుత డిమాండ్‌ను, మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకుని రెండు నుంచి మూడింతలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. రీజినల్రింగ్రోడ్డు, రీజినల్రింగ్రైలు, భారత్ఫ్యూచర్సిటీ వంటి వాటితో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఫలితంగా ఈ ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు పెరగనున్న మార్కెట్ వ్యాల్యూ బహిరంగ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉండనుంది. ఈ పెంపుతో ఓఆర్ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ప్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ ఖర్చులు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది దీర్ఘకాలంలో భూముల విలువ, వాస్తవ మార్కెట్ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు.
దీంతో బ్లాక్‌మనీ లావాదేవీలు తగ్గుతాయని, రియల్ ఎస్టేట్ రంగంలో మరింత పారదర్శకత వస్తుందని అంటున్నారు. అలాగే అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల విలువలను కొద్దిమేర పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎస్‌ఎఫ్టీకి రూ.2,200 ఉండగా, దాన్ని రూ.2,800 వరకు పెంచనున్నారు. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, స్థిరమైన మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
కమర్షియల్ స్పేస్ రేట్లు తగ్గింపు..
కమర్షియల్ స్పేస్ విలువలను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తగ్గింపు ఉండనుంది. ప్రస్తుతం ఎస్‌ఎఫ్టీకి రూ.7 వేలు ఉన్న వాణిజ్య స్థలాల విలువను రూ.6,500కి తగ్గించాలని రిజిస్ర్టేషన్ల శాఖ ప్రతిపాదించింది. ఈ తగ్గింపు ప్రధానంగా వ్యాపారాలకు, పారిశ్రామిక రంగానికి మేలు చేయనుంది. కొత్త కంపెనీలు తమ కార్యాలయాలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అలాగే వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గడం వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ఉద్యోగాల సృష్టికి కూడా దోహదం చేయనుంది.

