పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు భారతీయుల వంటింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పీజీ దిగుమతిదారుగా ఉన్న ఇండియా తన అవసరాల కోసం ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిపై ఆధారపడుతోంది. అయితే ఇరాన్ ఘర్షణల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సామాన్యులు ఇండక్షన్ స్టౌలు కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 'డై మిథైల్ ఈథర్' అనే ఇంధనం భారత్‌కు ఒక వరప్రసాదంగా మారబోతోందని CSIR భావిస్తోంది.
డై మిథైల్ ఈథర్ అనేది బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఒక స్వచ్ఛమైన ఇంధనం. దీనిని ఎల్‌పీజీతో కలిపి వాడటం వల్ల దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. EY-పార్థెనాన్, న్యూ ఎరా క్లీన్‌టెక్ సొల్యూషన్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఎల్‌పీజీలో 20 శాతం డిఎంఈని కలపడం ద్వారా భారత్ ఏడాదికి సుమారు 63 లక్షల టన్నుల గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవచ్చు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా.. ఇంధన భద్రత విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది.
సాధారణ వాతావరణ పరిస్థితుల్లో రంగు లేని వాయువుగా ఉండే డిఎంఈ, ఎల్‌పీజీతో సమానమైన ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది తక్కువ ఉద్గారాలను విడుదల చేసే పర్యావరణ హితమైన ఇంధనం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పటికే ఎల్‌పీజీలో 20 శాతం వరకు డిఎంఈ కలపడానికి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం మన దేశంలో దీని ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నందున దేశీయంగా డిఎంఈని భారీగా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే ప్రభుత్వ పరంగా స్పష్టమైన బ్లెండింగ్ పాలసీ అవసరమని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఇప్పటికే తన బొగ్గు నిల్వలను వాడుకుంటూ ప్రపంచ డిఎంఈ ఉత్పత్తిలో 90 శాతం వాటాను కలిగి ఉంది. భారత్ కూడా అదే బాటలో పయనిస్తే.. విదేశీ యుద్ధాల వల్ల కలిగే చమురు సరఫరా ఆటంకాల నుండి మన వంటింటిని కాపాడుకోవచ్చు. సంక్షోభ సమయాల్లో ఇలాంటి దేశీయ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.

