న్యూఢిల్లీ: భారత్–అమెరికా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం (బీటీఏ) తొలి దశపై చర్చల కోసం భారతదేశం నుంచి సుమారు 12 మంది అధికారులు ఈ నెల 20న వాషింగ్టన్ చేరనున్నారు. ఈ మూడు రోజుల సమావేశాన్ని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వం వహించనున్నారు. కస్టమ్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులూ బృందంలో ఉన్నారు. అమెరికా సుప్రీం కోర్టు రెసిప్రోకల్ టారిఫ్స్‌ను రద్దు చేసిన తర్వాత, ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 150 రోజులపాటు అన్ని దేశాలపై 10శాతం టారిఫ్ వేశారు. ఈ మార్పుల నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.
ఇప్పుడు ఏప్రిల్ 20–22 మధ్య వాషింగ్టన్‌లో జరుగుతున్నాయి. ఒప్పందం ప్రకారం, అమెరికా భారత వస్తువులపై టారిఫ్‌ను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించేందుకు అంగీకరించింది. భారత్ కూడా అమెరికా పరిశ్రమ ఉత్పత్తులు, ఆహార–వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించేందుకు సిద్ధమైంది. అదనంగా, వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఎనర్జీ ఉత్పత్తులు, విమానాలు, టెక్నాలజీ, కోకింగ్ కోల్ కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది.
కాగా, చైనా 2025–26లో భారత్‌కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికాను అధిగమించింది. అమెరికాకు భారత ఎగుమతులు 87.3 బిలియన్ డాలర్లు, దిగుమతులు 52.9 బిలియన్ డాలర్లు కాగా, వాణిజ్య మిగులు 34.4 బిలియన్ డాలర్లకి తగ్గింది.

