V6 News

ఆర్థిక సంక్షోభం దిశగా ఎమిరేట్స్? డాలర్లు అయిపోతే చైనీస్ యువాన్ దిక్కు: UAE

ఆర్థిక సంక్షోభం దిశగా ఎమిరేట్స్? డాలర్లు అయిపోతే చైనీస్ యువాన్ దిక్కు: UAE

ఖలిజ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో.. అగ్రరాజ్యం అమెరికాతో కరెన్సీ మార్పిడి ఒప్పందం కోసం యూఏఈ చర్చలు ప్రారంభించింది. వాషింగ్టన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మహ్మద్ బలమా, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌తో ఈ విషయంపై చర్చించారు. మార్కెట్ ఒత్తిడికి లోనై డాలర్ నిల్వలు తగ్గితే.. వెంటనే అవసరమైన డాలర్లను తెచ్చుకోవడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ఈ చర్చల్లో యూఏఈ అధికారులు ఒక కీలకమైన హెచ్చరికను కూడా అమెరికా ముందు ఉంచారు. ఒకవేళ అమెరికా డాలర్ల లభ్యత తగ్గితే.. తాము క్రూడ్ అమ్మకాలకు అలాగే ఇతర లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ ను వాడాల్సి వస్తుందని అమెరికాకు తేల్చి చెప్పేసారు. యుద్ధం కారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీదుగా క్రూడ్ రవాణాకు ఆటంకాలు కలగడం యూఏఈ ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికే ఇరాన్ నుంచి సుమారు 2,800 డ్రోన్లు, క్షిపణులతో దాడులు ఎదుర్కొన్న యూఏఈ.. తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ కరెన్సీ స్వాప్ లైన్‌ను ఒక ఫైనాన్షియల్ లైఫ్‌లైన్ గా భావిస్తోంది.

యుద్ధం ఎఫెక్ట్ కేవలం క్రూడా ఆయిల్ రంగానికే పరిమితం కాకుండా.. యూఏఈకి ఉన్న ఫైనాన్షియల్ హబ్ హోదాను కూడా ప్రమాదంలో పడేశాయి. పెట్టుబడులు వెనక్కి వెళ్లే ముప్పు ఉండటంతో మార్కెట్లు అస్థిరంగా మారుతున్నాయి. ప్రస్తుతం యూఏఈ దగ్గర సుమారు 270 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఈ నిల్వలు సరిపోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే అదనపు భద్రత కోసం బహ్రెయిన్ వంటి పొరుగు దేశాలతో కూడా యూఏఈ ఇప్పటికే 5 బిలియన్ డాలర్ల స్వాప్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ స్వాప్ లైన్ కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. సాధారణంగా అమెరికా మార్కెట్లతో బలమైన సంబంధాలున్న బ్రిటన్, జపాన్, కెనడా వంటి దేశాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. యూఏఈతో అటువంటి విస్తృత ఆర్థిక సంబంధాలు లేవన్న సాకుతో ఫెడ్ అధికారులు ఈ ప్రతిపాదనపై పెదవి విరుస్తున్నారు. గతంలో అర్జెంటీనాకు 20 బిలియన్ డాలర్లు సాయం అందించినట్లుగా, ట్రెజరీ ద్వారా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో కూడా గల్ఫ్ దేశాల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు ఇరాన్ ఆస్తులను స్తంభింపజేయడం వంటి కఠిన నిర్ణయాలను కూడా యూఏఈ పరిశీలిస్తోంది. ఏప్రిల్ 17న కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటికీ.. చమురు రవాణాలో నెలకొన్న అడ్డంకులు తొలగడానికి ఇంకా కొన్ని వారాల సమయం పట్టవచ్చని సౌదీ ఆర్థిక మంత్రి అన్నారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన చమురు సరఫరా సంక్షోభంగా ఐఈఏ దీనిని అభివర్ణించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికా సహాయం అందిస్తుందా లేక యూఏఈ చైనా వైపు మొగ్గుకు వెళుతుందా అన్నది గల్ఫ్ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా మారనుంది.