ఎల్టీసీజీ ట్యాక్స్ రద్దు చేయం.. అందరికీ ఒకే విధంగా పన్ను: కేంద్రం

ఎల్టీసీజీ ట్యాక్స్ రద్దు చేయం.. అందరికీ  ఒకే విధంగా పన్ను: కేంద్రం

న్యూఢిల్లీ: షేర్ల లావాదేవీలపై లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌‌‌‌టీసీజీ)  ట్యాక్స్‌‌‌‌ను  రద్దు చేసే ప్రతిపాదనేది ప్రస్తుతానికి పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌‌‌‌కు తెలిపింది. మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌ను పెంచేందుకు ఈ పన్నును రద్దు చేయాలన్న మార్కెట్ వర్గాల డిమాండ్‌‌‌‌పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌‌‌‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  

ప్రస్తుతం లిస్టెడ్ ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌పై ఎల్‌‌‌‌టీసీజీ పన్ను 12.5 శాతంగా ఉంది. ఇది ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు దాటిన లాభాలకు మాత్రమే వర్తిస్తుంది. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌పీఐల)కు మినహాయింపు ఇచ్చి, దేశీయ ఇన్వెస్టర్లపై పన్ను వేస్తారన్న వార్తలను మంత్రి ఖండించారు. 

ఈక్విటీ పెట్టుబడులపై దేశీయ, రిటైల్, ఎఫ్‌‌‌‌పీఐలకు ఒకే రకమైన 12.5శాతం పన్ను రేటు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే  ప్రభుత్వ సెక్యూరిటీలలో  విదేశీ పెట్టుబడులకు మాత్రమే వడ్డీ, మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎల్‌‌‌‌టీసీజీ ద్వారా మొత్తం రూ. 2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.