V6 News

ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిని మెసేజ్ లతో వేధించిన రైడర్... చివరికి..

ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిని మెసేజ్ లతో వేధించిన రైడర్... చివరికి..

ర్యాపిడో బైక్ ట్యాక్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అవసరం లేదు. హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లో బైక్ ట్యాక్సీ మీద ఆధారపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిరుద్యోగులకు, పార్ట్ టైం జాబ్స్ చేసేవారికి బైక్ ట్యాక్సీ యాప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే... ఈ యాప్స్ ద్వారా దొంగతనాలకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు కూడా ఎక్కువవుతున్నారు. బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నవారిని బెదిరించి డబ్బులు దోచుకోవడం, మహిళలపై అత్యాచారానికి పాల్పడటం వంటి ఘటనలు చూశాం. సోషల్ మీడియాలో ఇలాంటి మరో ఘటన వైరల్ అవుతోంది. ర్యాపిడో రైడర్ తనకు వాట్సాప్ లో మెసేజ్ చేసి వేధిస్తున్నాడంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ యువతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ గా మారిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైడ్ బుక్ చేసుకున్న కస్టమర్ పర్సనల్ నంబర్ ఎలా వచింది... ఇలాంటి యాప్స్ లో యూజర్ల డేటాకు భద్రత ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. తన లొకేషన్ లో డ్రాప్ చేసిన తర్వాత రాపిడో రైడర్ వాట్సాప్‌లో తనకు మెసేజ్ చేశాడని.. క్యూట్ గా ఉన్నావు, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటూ మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టాడంటూ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేసింది యువతి.

ర్యాపిడో రియాక్షన్ ఇది:

ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేస్తూ ర్యాపిడో కంపెనీని కూడా ట్యాగ్ చేసింది యువతి. ఈ పోస్ట్ కి స్పందించిన ర్యాపిడో కెప్టెన్ అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని... రైడ్ ఐడీని, యువతి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్  తమకు పంపాలని కోరింది ర్యాపిడో.