తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. మెరుగైన ఇరిగేషన్ వ్యవస్థతో రైతులకు మరింత మేలు చేయాలని సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్‌ను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఓ అండ్ఎంను ప్రత్యేక కేటగిరీగా పెట్టింది. మేజర్ ఇరిగేషన్లో మైనర్ ఇరిగేషన్‌ను కలిపేసింది. కొత్తగా టెరిటోరియల్ ఇంజినీర్లు, టెరిటోరియల్ ఈఎన్సీలు, హెడ్‌క్వార్టర్ ఈఎన్సీలు అంటూ కొత్త పోస్టులను తీసుకొచ్చింది. అయితే, దీని వల్ల నష్టమే తప్ప.. మేలు జరగడం లేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే మరోసారి శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించింది. డ్యాముల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
4 ప్రాజెక్టులకు స్పెషల్ ఆఫీసర్లు..
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన దుస్థితి మరే ప్రాజెక్టుకూ రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ప్రత్యేకంగా సీఈ స్థాయి అధికారిని నియమించాలని భావిస్తున్నది. అందులో భాగంగా 4 ప్రాజెక్టులను ఇరిగేషన్ సలహాదారు ఆ జాబితాలో పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నాగార్జునసాగర్+ఏఎమ్మార్పీ లిఫ్ట్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను జాబితాలో చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు ప్రత్యేకంగా ఒక సీఈని నియమించాలని సూచించారు. ఈ అధికారులు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మెయిన్ కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్, పంప్హౌస్లలాంటి వాటికి ఎప్పటికప్పుడు రికార్డులను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు వివరించాల్సి ఉంటుంది. దానికి అదనంగా లిఫ్టులకు ఇద్దరు డీఈఈలు (ఒక ఎలక్ట్రికల్, ఒక మెకానికల్ ఇంజినీర్లు), ఇద్దరు ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల ఏఈఈలనూ నియమించాలని పేర్కొన్నారు. లిఫ్టుల ఆపరేషన్‌కు సంబంధించి ఆయా అధికారులకు సమగ్రమైన శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
అధికారుల పునర్వ్యవస్థీకరణ..
అధికార వ్యవస్థనూ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించనున్నది. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మిన్ యథావిధిగానే ఉంచి.. కొన్ని టెరిటోరియల్ ఈఎన్సీల పదవులను తొలగించాలని భావిస్తున్నారు. మరికొన్ని విభాగాలకూ ఈఎన్సీలను నియమించేలా కసరత్తు చేస్తున్నారు. కమిషనర్ ఆఫ్ టెండర్స్, వాలంతరీలకు ఈఎన్సీలను నియమించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక, అంతర్రాష్ట్ర జలవివాదాలు అత్యంత కీలక దశలో ఉన్నందున.. దానినీ ఓ ప్రత్యేకమైన విభాగంగా మార్చాలని ప్రతిపాదించారు. డ్యాముల సేఫ్టీ, అంతర్రాష్ట్ర జలవివాదాలు, హైడ్రాలజీ సంబంధింత అంశాలకు ఒక ఈఎన్సీని నియమించాలని సూచించారు. శాఖలోని ప్రధానాంశాలను పైస్థాయి అధికారులు, ప్రభుత్వానికి నివేదించేలా సెక్రటేరియెట్‌లో అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఈఎన్సీగా నియమించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. అదే సమయంలో ఆపరేషన్అండ్ మెయింటెనెన్స్‌కు ఈఎన్సీని తొలగించే ప్రతిపాదనలూ ప్రభుత్వం ముందు పెట్టారు. ఇక, మరికొన్ని కీలకమైన విభాగాలకు రాష్ట్రస్థాయిలో పనిచేసేలా చీఫ్ ఇంజినీర్లను నియమించాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ఎంక్వైరీస్ విభాగాలకు స్టేట్‌లెవెల్ సీఈలను నియమించాలని ప్రతిపాదించారు.

