వర్ధన్నపేట, వెలుగు: పట్టపగలే గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామం దొడ్లబండ ప్రాంతానికి చెందిన న్యాయం రవీందర్ రెడ్డి(50)పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దొడ్లబండ శివారులో గొర్రెలను మేపుతుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి రవీందర్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించారు. రవీందర్ రెడ్డి ప్రతిఘటించి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, వెంట పడి కత్తులతో నరికేందుకు యత్నించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దగ్గరలోనే ఇండ్లు ఉండడంతో స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రగాయాల పాలైన రవీందర్ రెడ్డిని అంబులెన్స్ లో ఎంజీఎంకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సమ్మిరెడ్డి, రవీందర్రెడ్డి మధ్య భూ తగాదాలు ఉన్నాయని, అతనే ఈ పని చేసి ఉంటాడని రవీందర్ రెడ్డి కూతురు అనుమానం వ్యక్తం చేసింది.

