V6 News

అల్లు అర్జున్ '30 పైసలు' ఫార్ములా.. రెమ్యునరేషన్ విషయంలో బన్నీ గ్రేట్ డెసిషన్!

అల్లు అర్జున్ '30 పైసలు' ఫార్ములా.. రెమ్యునరేషన్ విషయంలో బన్నీ గ్రేట్ డెసిషన్!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నటుల్లో అల్లు అర్జున్ కు ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు అరవింద్ తనయుడిగా 'విజేత' (1985)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన బన్నీ.. 'గంగోత్రి' (2003)తో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టారు. వారసత్వం ఉన్నప్పటికీ, తనదైన డాన్స్, స్టైల్, నటనతో 'ఐకాన్ స్టార్‌'గా ఎదిగి, ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించారు.

మూడే సినిమాలు.. రూ. 2,361 కోట్ల విధ్వంసం!

గడిచిన ఐదారేళ్లలో అల్లు అర్జున్ బాక్సాఫీస్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. 'అల వైకుంఠపురములో', 'పుష్ప: ది రైజ్', 'పుష్ప 2: ది రూల్'.. కేవలం ఈ మూడు చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 2,361.55 కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు సృష్టించారు.  ముఖ్యంగా 'పుష్ప 2' ఏకంగా రూ. 1,742 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.

రూపాయిలో 30 పైసలు.. బన్నీవే!

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా షూటింగ్ మొదలవకముందే వందల కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. కానీ అల్లు అర్జున్ రూటే వేరు.  ఒక తెలివైన 'రెవెన్యూ షేరింగ్' మోడల్‌ను అనుసరిస్తున్నారు.  అల్లు అర్జున్ సినిమాకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోరు. సినిమా వసూళ్లు చేసే ప్రతి రూపాయి ఆదాయంలో 30 పైసలు వాటాగా తీసుకుంటారని  ప్రముఖ నిర్మాత జి. ధనంజయన్‌ వెల్లడించారు.

దీనివల్ల నిర్మాతకు కలిగే లాభం అంతా ఇంతా కాదు. హీరో పారితోషికం ముందే ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి, సినిమా బడ్జెట్ తగ్గుతుంది. నిర్మాత అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉండదు. సినిమా హిట్టయితే బన్నీకి భారీగా వస్తుంది, ఒకవేళ అనుకున్న స్థాయిలో ఆడకపోయినా నిర్మాతపై భారం పడదని ధనంజయన్ చెప్పుకొచ్చారు.

పుష్ప 2తో రూ. 522 కోట్ల ఆదాయం?

ఈ 30 శాతం లెక్కల ప్రకారం చూస్తే.. 'పుష్ప: ది రైజ్' వసూళ్లు చేసిన రూ. 350 కోట్లలో బన్నీ సుమారు రూ. 105 కోట్లు అందుకున్నారు. ఇక బాక్సాఫీస్ సునామీ సృష్టించిన 'పుష్ప 2' సుమారు  రూ. 1,742 కోట్లు రాబట్టింది. దీని ద్వారా ఆయనకు దక్కిన వాటా దాదాపు రూ. 522 కోట్లు. లేటెస్ట్ గా 'ధరంధర్ ' మూవీ పుష్ప రికార్డులను కొల్లగొట్టేసింది.  ఏది ఏమైనా ఇంత పెద్ద మొత్తంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక హీరోగా అల్లు అర్జున్ అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అట్లీతో 'రాకా' వేట!

ప్రస్తుతం అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశారు. క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు. సుమారు రూ. 800 కోట్ల వ్యయంతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయిక. పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ, అట్లీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.