కామారెడ్డి జిల్లాలో విషాదం..పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

కామారెడ్డి జిల్లాలో  విషాదం..పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో  కానిస్టేబుల్  మృతి

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. గాంధారి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగానే ఈ ఘోరం జరగడంతో తోటి సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

గాంధారి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రఘు.. ఎప్పటిలాగే ఈరోజు కూడా తన విధులకు హాజరయ్యారు. అయితే స్టేషన్‌లో పని చేసుకుంటున్న సమయంలోనే ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆయనను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే పరిస్థితి విషమించి రఘు తుదిశ్వాస విడిచారు.

►ALSO READ | బాసర గోదావరిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు

కానిస్టేబుల్ రఘు అకాల మరణం పట్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, తోటి కానిస్టేబుళ్లు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే రఘు.. ఇలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడాన్ని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.

విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో రఘు మరణించారనే వార్త వినగానే ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.