కరోనా అలర్ట్: హై రిస్క్ ఉన్నవాళ్లకు ఈ మెడిసిన్…

కరోనా అలర్ట్: హై రిస్క్ ఉన్నవాళ్లకు ఈ మెడిసిన్…

కరోనా నియంత్రణ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఏర్పాటు చేసి నేషనల్ టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వల్ల హై రిస్క్ ఉన్న పాపులేషన్ మలేరియా ట్రీట్మెంట్‌ కు వాడే హైడ్రాక్సీ-క్లోరోక్విన్ టాబ్లెట్‌ను ఇవ్వొచ్చని అడ్వైజరీ జారీ చేసింది. ముందు జాగ్రత్తగా ఇలా మెడిసిన్ వాడడాన్ని కీమో ప్రొలాక్సిస్‌ అంటారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదంతోనే ఈ సూచనలను జారీ చేసినట్లు పేర్కొంది ఐసీఎంఆర్. కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్న సిబ్బంది, కరోనా బాధితుల కుటుంబసభ్యులకు మాత్రమే ఈ ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వాలని చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ.

హైరిస్క్ పాపులేషన్‌ వీరే..

– కరోనా అనుమానితులు, నిర్ధారిత కేసులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది (ఎటువంటి సింప్టమ్స్ లేకున్నా).

– కరోనా పాజిటివ్ అని తేలిన వారితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇంట్లో వారిని చూసుకుంటున్న వాళ్లను హైరిస్క్ పాపులేషన్‌గా పేర్కొంది నేషనల్ టాస్క్ ఫోర్స్.

రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లకు సూచనలు

– కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు, నర్సులు సహా ఇతర హెల్త్ కేర్ వర్కర్స్‌ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్ మెంట్ వాడడంతో పాటు తరచూ చేతులు కడుక్కోవడం లాంటి ఇతర జాగ్రత్తలను పాటించాలి. కరోనా నుంచి కాపాడుకునేందుకు కీమోప్రోలాక్సిస్‌నే మార్గంగా చూడడం తప్పు.

– హెల్త్ వర్కర్స్ అంతా తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. ఏ మాత్రం కరోనా బారినపడినట్లు అనుమానం కలిగినా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించేలా చూసుకోవాలి.

– టాస్క్ ఫోర్స్ సూచించిన మెడిసిన్‌ను తప్పనిసరిగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలి.

– కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇతరులకు ఈ మందులు ఇచ్చిన తర్వాత కూడా హోం క్వారంటైన్‌లోనే ఉంచాలి.

– డాక్టర్ల సూచనతో ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కాకుండా వేరే ఆరోగ్య పరమైన ఇబ్బంది తలెత్తితే వెంటనే ఆ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి. 

హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ పడని వాళ్లకు తీవ్రమైన దురదలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.