ఆస్తులమ్మి అన్నం పెడుతున్నఅన్నదమ్ములు

ఆస్తులమ్మి అన్నం పెడుతున్నఅన్నదమ్ములు

అమ్మా నాన్నా లేని ముగ్గురు బిడ్డలకు అమ్మమ్మే అమ్మ. అశక్తులరాలైన ఆమె నాన్నలా సాదలేకపోయింది. బస్తీ జనమే పైసా పైసా చందాలేసుకుని తలదాచుకోడానికి ఓ చిన్న గది కట్టిచ్చారు. బంగారు గనులున్న కోలార్​లో అరటిపళ్లమ్ముతూ ఇద్దరు అన్నదమ్ములూ బంగారు బాల్యాన్ని పోగొట్టుకున్నారు. కానీ, ఆకలి నేర్పిన అనుభవాలతో వాళ్లు పట్టింది బంగారమయ్యింది. కోట్ల ఆస్తులు కూడబెట్టినా కూటికి లేనివాళ్లకు దూరం కాలేదు. ఆకలి బాధ తెలిసిన ఈ అన్నలిద్దరూ కరోనా కాలంలో పస్తులున్న వలస కూలీల ఆకలి తీరుస్తున్నరు. జేబులో డబ్బులు అయిపోయినయని చేతులు దులుపుకోకుండా ఆస్తులమ్మి చేయి చాచిన వాళ్లకు తిండి పెడుతున్నరు.

మార్చి 22. జనతా కర్ఫ్యూ. కరోనా భయానికి దేశమంతా ఎక్కడికక్కడ నిలిచిపోయిన రోజు. జనతా కర్ఫ్యూ తరువాత రోజు  బతుకు పయనం సాగిపోతుందని ఆశపడ్డ కష్ట జీవికి కరోనా కంటే ప్రమాదకరమైన ఆకలి పరీక్ష వచ్చింది. గుడిసెలో గింజల్లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని చూసి తల్లి విలవిల్లాడిపోతుంది. బయటికి పోతే పోలీసులు కొడుతున్నరని అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. పొద్దుటి నుంచి ఏం చేయాలో తోచని ఆ  తండ్రి… ఏమైనా దొరక్కపోతుందా అని ఆశతో రోడ్డు మీదకు వచ్చాడు. నడుస్తూ పోతుంటే తాజమ్మల్ ఇల్లు కనపడింది. తాజమ్మల్​కి ఆకలి బాధ చెప్పుకున్నడు.

‘ఇంత అన్నం పెడితే ఈ రాత్రి ఆకలి తీరుద్ది. రేపు ఎటుపోతవ్? అటు ఇటు తిరిగి, బిడ్డలకు అన్నంతో పాటు రోగాన్ని తీసుకుపోతవ్. అట్ల చెయ్యొద్ద’ని చెప్పి పది కేజీల బియ్యం ఇచ్చిండు. ‘ఇవి అయిపోతే మళ్లీ రా. బయటికి మాత్రం పోవద్ద’ని చెప్పిండు తాజమ్మల్​. ‘నిన్ను ఆ దేవుడు సల్లంగ చూడాలె’ అంటున్న ఆ పేద తండ్రిని చూసి తాజమ్మల్ కన్నీళ్లు పెట్టుకున్నడు. కళ్ల ఎదురుగా ఉన్న ఆ తండ్రి ఆరాటంలో తన బాల్యం నాటి ఆకలి పోరాటం గుర్తుకొచ్చింది తాజమ్మల్​కి. ఒకప్పుడు నాలా ఆకలి బాధపడుతున్న పిల్లలెంతమంది ఉన్నరో? అనుకున్న తాజమ్మల్ తమ్ముడితో కలిసి కూలీనాలీ చేసుకుంటూ బతికే జనం ఉండే బస్తీకి పోయిండు.

ఆకలి తీర్చని కన్నీళ్లు

‘బిడ్డలు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులూ చూస్తూ ఉండలేరు. ఏదో ఒకటి చేసి తిండి సంపాదించాలనే ప్రయత్నం కూడా ప్రమాదమే. ఎలాగైనా వీళ్లను కాపాడుకుందాం. ఎంత ఖర్చయినా తిండి పెడదామ’ని అన్న తాజమ్మల్​ అంటే తమ్ముడు ముజమిల్ ‘సరే’ అన్నాడు. బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, కారం, కిరాణా సరుకులన్నీ కొని ఇంటికి తెచ్చి వాటిని ఇంటింటికీ ఇచ్చేట్లు అన్నదమ్ములు ప్యాక్​ చేస్తుంటే ఇంట్లో ఆడోళ్లు, చిన్నోళ్లు కూడా తలా ఒక చెయ్యేశారు. ఆ సరుకులన్నీ పంచడానికి వెహికల్స్​ కావాలె. దోస్తుల్ని రమ్మని బైక్​లపైనే మూటలు వేసుకుని బస్తీలకు పోయారు.

షాదీ డబ్బులు తీసుకో అబ్బాజాన్​

‘అమ్మా ఈ బస్తీలో కూలి చేసుకుని బతికేటోళ్లు ఏడుంటరు? అని వాళ్లుండే కాలనీ చుట్టుపక్కల దారులన్నీ తిరిగారు. భర్తలేని ఆడవాళ్లు, కొడుకులకు దూరంగా ఉన్న ముసలోళ్లకు కూడా సరుకులిచ్చి అయిపోతే మళ్లీ ఇస్తం. కానీ ఇంట్లనే ఉండండని చెబుతూ రోజుకో బజారు తిరిగి పంచారు. ఒక్కో ఇంటికి పది కేజీల బియ్యం,  రెండు కేజీలు మైదా, కేజీ దాల్, లీటర్​ నూనె, ధనియాల పొడి, కారం, టీ పొడిని ప్యాక్​ చేసి ఇంటింటికీ ఇచ్చారు. మొదటి రోజు 50 ఇండ్లకు పంచారు. సాయం కోసం చూసే జనం చాలామందే ఉన్నారు. ఏం చేయాలిప్పుడు? అని ఆ అన్నదమ్ములు ఆలోచనలో పడ్డప్పుడు..  ఆకలి కంటే ఏదీ ముఖ్యం కాదనిపించింది. ‘నా పెండ్లి కోసం దాచిన ఐదు లక్షలు తీసుకో… అబ్బాజాన్​. ఖర్చు లేకుండా మసీదులో షాదీ చేసినా నాకు ఇష్టమే’ అన్నది తాజమ్మల్​ కూతురు. షాదీ కోసం దాచిన దుడ్లు వద్దని, ఆస్తులు అమ్మాలి అనుకున్నారు.

అన్నదానం కోసం ఆస్తి త్యాగం

తాజమ్మల్​ బ్రదర్స్​ చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్​. ఈ ఫీల్డ్​లో కొనేవాళ్లంతా కాంటాక్ట్​లోనే ఉంటారు. ఫోన్​ చేసి పరిస్థితి చెప్పారు. మాటల్లోనే బేరం కుదిరింది.1400 చదరపు అడుగుల ప్లాట్​ని పాతిక లక్షలకు అమ్మారు. డీల్ కుదుర్చుకున్న పార్టీ12 లక్షలు అడ్వాన్స్​ ఇచ్చింది. తాజమ్మల్ బ్రదర్స్​ సాయం మొదలైంది. ముందటి రోజు లెక్కనే సరుకులన్నీ పంచాలనుకున్నారు. లారీల సరుకు తెచ్చి ఇంట్లో దించారు. ఇల్లు గోడౌన్​ అయిపోయింది. ఇంట్లో వాళ్లు, సేవ చేయాలనే వలంటీర్లంతా ఆ సరుకుల్ని ​ పగలంతా ప్యాకింగ్​చేయడం, పొద్దున, సాయంత్రం బైక్​ల మీద పోయి వాటిని పంచడం మొదలుపెట్టారు. పంచుకుంట పోతే12 లక్షల రూపాయలు పది రోజుల్లోనే అయిపోయాయ్. తర్వాత మిగతా 13 లక్షలొచ్చినయ్​. ఇప్పుడైతే కరోనాకు మందు లేదు. రేపు కరోనాకి మందు వస్తది. కానీ, అన్ని రోగాల కంటే ఆకలి భయంకరమైనదని ఆ అన్నదమ్మలిద్దరికీ తెలుసు. ఎందుకంటే? ఆకలి వాళ్లకు అనుభవం. ఆకలి వాళ్ల బాల్యం.

ఆకలి అనుభవాలు..

ఈ అన్నదమ్ములిద్దరూ బస్తీ(స్లమ్​)లో బతికే పేదల ఆకలి ఎరిగినవాళ్లు. తాజమ్మల్​ పదేళ్ల వయసులో అరటి పళ్లు అమ్మేవాడు. ఆ రోజుల్లో తమ్ముడు ముజమిల్​ పాషా , చెల్లి, అమ్మమ్మ మహబూబ్​ బీతో కలిసి స్లమ్​లోనే ఉండేవాడు. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు నాన్న జబ్బునపడి చనిపోయిండు. తండ్రి చనిపోయిన 40 రోజులకు మనాదితో అమ్మ కూడా చనిపోయింది. మూడేళ్ల తమ్ముడు, ఏడాది వయసు చెల్లితో కలిసి సొంతూరు మహ్మద్​పూర్​ వదిలి కోలార్​ వచ్చాడు.

అవ్వా.. బువ్వా.. నానీ మా..

అనాథలైన ముగ్గురు బిడ్డల్నీ అమ్మమ్మ చేరదీసింది. అరబిక్​ ట్యూషన్లు చెబుతూ కొన్నాళ్లు సాకింది. బుక్కెడు బువ్వ కోసం బిడ్డలు పడుతున్న యాతన చూసి చాలామంది సాయం చేసేవాళ్లు. మనసున్న మనుషులు చందాలేసుకుని మసీదు సాయంతో బస్తీలో ఓ చిన్న ఇల్లు కట్టి ఇచ్చారు. నాలుగ్గోడల మధ్య నలుగురూ తలదాచుకున్నారు. కానీ, ఆకలి బాధకు నిద్రరాక ఒత్తిగిల్లి ఎన్ని రోజులు పడుకుంటామని పెద్దోడు బడి మానేశాడు. చేతనైన పని చేద్దామని రోడ్డెక్కితే పసి ప్రాణం చేసే పనే దొరకలేదు. బక్క ప్రాణానికి బరువు కాని కొలువొకటిచ్చిండు ఒక అరటిపళ్ల వ్యాపారి. మండీలో  గెలలు మోసే పని అప్పజెప్పిండు. పదేళ్ల వయసులో తాజమ్మల్​ కెరీర్​ స్టార్ట్ అయింది. అరటి గెలలు మోస్తే రోజుకు రెండు రూపాయల కూలీ. ఆ కూలీ డబ్బులకు బియ్యమే వచ్చేది. కూరకు పైసా మిగల్లే. అన్నంలో నీళ్లు పోసి తాగించేది అమ్మమ్మ.

నమ్మకంతో ఎదిగా

ఆకలి అనుభవాలతో పెరిగిన తాజమ్మల్ ఏటా పనిలో జీతం పెంచుకుంటూ పోయిండు. అలా నెలకు 90  రూపాయల జీతం అయ్యింది. అరటి గెలలు మోసే పని నుంచి తోపుడు బండిపై అరటి పళ్ల బేరం మొదలుపెట్టిండు. ‘ఇరవైయ్యేళ్ల వయసులో మొదలుపెట్టిన చిన్న వ్యాపారం నమ్మకమే పెట్టుబ డిగా ఎదిగింద’ని తాజమ్మల్ చెబుతున్నడు. ఐదేళ్లకే ఆ వ్యాపారంలో నాకు మంచి పేరొచ్చింది. తమ్ముడ్ని కూడా ఇదే పనిలో పెట్టిన. ‘వీడికి మాల్ ఇస్తే డబ్బులు యాడికీ పోవు’ అని సేట్లకు నమ్మకం వచ్చింది. పదివేలు ఇచ్చి లక్ష రూపాయల మాల్​ తెచ్చుకున్నా. ఆ మాల్ చిన్న వ్యాపారులకు ఇచ్చి, అమ్మంగ వచ్చిన డబ్బుని సేట్​కి ఇచ్చేవాడ్ని. ఇలావ్యాపారంలో లాభాలొచ్చినయ్’ అన్నాడు తాజమ్మల్​.

గోల్డెన్​ డేస్​

‘ఇరవయ్యో ఏట నుంచి అరటి పళ్లు బండి మీద అమ్మడం మొదలుపెట్టిన. ఐదేళ్లకు మంచి పేరు వచ్చింది. ఎన్ని దుడ్లు వచ్చినా అమ్మమ్మ చేతికే ఇచ్చాం. ముగ్గురికీ పెండ్లి చేసినంక అమ్మమ్మ కాలం చేసింది. కష్టపడుతూ పైసా పైసా పోగేశాం.  ఓ మంచి ఇల్లు కట్టుకోవాలన్నది మా కల. ఇరవై ఏళ్ల సేవింగ్స్​తో 2010లో ఓ స్థలం కొన్నాం. ఉన్న డబ్బు స్థలానికే సరిపోయింది. ఇల్లు వచ్చేఏడాది కడదామనుకున్నాం. ఏడాది తిరిగే సరికి ఆ స్థలం రేటు డబుల్​ అయ్యింది. అరె.. ఇరవై ఏళ్లు కష్టపడితే సంపాదించిన సొమ్ము ఏ కష్టం లేకుండా వచ్చేట్టుందే అనుకుని దాన్ని అమ్మినం. రియల్ ఎస్టేట్లో ఉండే లాభం ఏమిటో తెలిసొచ్చింది. ఇదే మన ప్యూచర్​ అనుకుని అడుగుపెట్టాం. కానీ, అరటిపళ్ల వ్యాపారం ఆపలే. బిజినెస్​ పెరిగింది. అరటి తోటలు లీజ్​కి తీసుకున్నాం. ఆ తర్వాత నీళ్ల తిప్పలొచ్చినయ్​. తోటలు బంద్​ పెట్టి, బెంగళూరు నుంచి ఫ్రూట్స్​ దిగుమతి మొదలుపెట్టాం. పట్టిందల్లా బంగారమైంది’ అని వాళ్లిద్దరూ గతాన్ని గుర్తుచేసుకునేలా చేసింది కరోనా.

::: నాగవర్ధన్​ రాయల