జూలై 27న ‘సీపీఐ’ దేశవ్యాప్త ఆందోళనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

జూలై 27న ‘సీపీఐ’ దేశవ్యాప్త ఆందోళనలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా సీపీఐ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద, హైదరాబాద్‌‌‌‌లోని గవర్నర్ కార్యాలయం (లోక్ భవన్) వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా పార్టీ కార్యదర్శి బాలకిషన్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. కూనంనేని మాట్లాడుతూ..నీట్​ప్రశ్న పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 14 వరకు అన్ని జిల్లాలతోపాటు ప్రత్యేక నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. సెప్టెంబరు 1న 'చలో ఢిల్లీ' పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

సెప్టెంబరు 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.  సెప్టెంబరు 17న పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు వెంకటరెడ్డి, రామకృష్ణ, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ పాల్గొన్నారు.