అభ్యుదయ భావాలున్న నటుడు మాదాల రంగారావు: సీపీఐ నారాయణ

అభ్యుదయ భావాలున్న నటుడు మాదాల రంగారావు: సీపీఐ నారాయణ
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ముషీరాబాద్, వెలుగు: అభ్యుదయ, విప్లవ చిత్రాలతో జనాల్లో చైతన్య స్ఫూర్తి రగిలించిన వ్యక్తి మాదాల రంగారావు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ప్రజా కళాకారుడు, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు 75వ జయంతి ఉత్సవాలు గురువారం రాత్రి బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. చీఫ్​గెస్టుగా హాజరైన నారాయణ మాట్లాడుతూ.. సమాజంలోని అవినీతి, అన్యాయం, దౌర్జన్యం, అణచివేత, రాజకీయ దుర్వినియోగం లాంటి అంశాలే 1980వ దశకంలో మాదాల రంగారావు సినిమాలకు కథా వస్తువులయ్యాయని అన్నారు.

సామాజిక విప్లవ సినిమాలతో ఆయన సంచలనం సృష్టించారన్నారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్ర మల్లెలు, విప్లవ శంఖం, నవోదయం, మహాప్రస్థానం లాంటి సినిమాల్లో నటించి ఆయన ‘రెడ్ స్టార్’​గా పేరు పొందారన్నారు. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నర్సింహా, ప్రముఖ నటుడు మురళీమోహన్, అరుణోదయ విమలక్క, ప్రముఖ కవి, రచయిత ఎస్వీ సత్యనారాయణ, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నిర్మాత పోకూరి బాబురావు, సింగర్ వందేమాతరం శ్రీనివాస్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం చైర్మన్ భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.