షాపింగ్ చేసేద్దాం.. జనవరిలో 30 శాతం పెరిగిన క్రెడిట్‌‌ కార్డు ట్రాన్సాక్షన్లు

షాపింగ్ చేసేద్దాం.. జనవరిలో 30 శాతం పెరిగిన క్రెడిట్‌‌ కార్డు ట్రాన్సాక్షన్లు
  •      జనవరిలో 30 శాతం పెరిగిన ట్రాన్సాక్షన్లు
  •     ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌లో విపరీతంగా పెరిగిన కార్డుల వినియోగం
  •     రివార్డులతో యువతను ఆకర్షిస్తున్న బ్యాంకులు

న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి. బ్యాంకులు ఆఫర్ చేస్తున్న రివార్డ్ పాయింట్లు కన్జూమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా రీపేమెంట్‌‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండడం కలిసొస్తోంది.  ఈ ఏడాది జనవరిలో రూ.1.7 లక్షల కోట్ల విలువైన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. కిందటేడాది జనవరిలో జరిగిన ట్రాన్సాక్షన్లతో పోలిస్తే ఇది 30 శాతం పెరుగుదలకు సమానం.

అదే ట్రాన్సాక్షన్ల సంఖ్య అయితే  26 కోట్ల  నుంచి 26 శాతం పెరిగి 33 కోట్లకు చేరుకున్నాయి. ఆర్‌‌‌‌బీఐ డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లలో ఎక్కువగా ఆన్‌‌లైన్ షాపింగ్‌‌ ట్రాన్సాక్షన్లు, బిల్లు పేమెంట్లు ఉన్నాయి. యువత ఎక్కువగా ఆన్‌‌లైన్ కొనుగోళ్లు జరుపుతోంది.  ఫ్లెక్సిబుల్‌‌ ఈఎంఐ ఆప్షన్స్ ,  ‘బై నౌ, పే లేటర్‌‌‌‌’ స్కీమ్‌‌ యువతను ఆకర్షిస్తున్నాయి. 

ఫ్యూచర్‌‌‌‌లో మరింతగా

బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు ఇచ్చే  అన్‌‌సెక్యూర్డ్ లోన్లపై ఆర్‌‌‌‌బీఐ  రిస్ట్రిక్షన్లు పెట్టినా క్రెడిట్ కార్డుల వాడకం తగ్గలేదు. పొదుపు ఎకానమీ నుంచి  అప్పు లేదా వినియోగ ఆధారిత ఎకానమీ వైపు మారుతున్న  ఏ దేశంలోనైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఫైనాన్షియల్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ అండ్ సిస్టమ్స్‌‌ సీఈఓ వీ బాలసుబ్రమణియన్‌‌ అన్నారు.  క్రెడిట్ కార్డుల వాడకంలో యువత కీలకంగా ఉందని, ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌ వీరే ఎక్కువగా చేస్తున్నారని పేర్కొన్నారు. అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌‌ఫామ్‌‌లలో  ట్రాన్సాక్షన్లు పెరిగాయి.

కిందటేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 37 శాతం గ్రోత్ నమోదు చేశాయి. ఈ ట్రాన్సాక్షన్లలో కూడా 65 శాతం కార్డుల ద్వారానే జరిగాయి.  పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వాటా 30 శాతం ఉంది.  ‘ అమెజాన్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లో జరుగుతున్న మెజార్టీ ట్రాన్సాక్షన్లు కార్డుల ద్వారా జరుగుతున్నాయి.  బై నౌ పే లేటర్‌‌‌‌ స్కీమ్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. కార్డు యూజర్లు ఎక్కువగా వాడే ఈఎంఐ స్కీమ్‌‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వినియోగదారుడు ముందే కొని తర్వాత  చెల్లించుకునే అవకాశం కలిపిస్తున్నాయి’ అని బాలసుబ్రమణియన్ అన్నారు.  

పేమెంట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగవ్వడంతో  బ్యాంకులు కూడా కంఫర్టబుల్‌‌గా ఉన్నాయని పేర్కొన్నారు.   ‘దేశంలో డిజిటల్ ఎకోసిస్టమ్‌‌  మెరుగయ్యింది. దీంతో బ్యాంకులు తమ ఓవరాల్ బిజినెస్‌‌ను మెరుగుపరుచుకున్నాయి’ అని ఫెడరల్ బ్యాంక్ రిటైల్ అసెట్స్‌‌ కంట్రీ హెడ్‌‌ చిత్రభాను అన్నారు. వ్యాపారులు కూడా  క్యాష్​ నుంచి కార్డు పేమెంట్లకు షిప్ట్‌‌ అవ్వడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. ఫ్యూచర్‌‌‌‌లో కార్డు ట్రాన్సాక్షన్లు మరింత పెరుగుతాయని అంచనా వేశారు.