మన ఊరు మన బడి ప్రోగాం స్కూళ్ల ఎంపిక  తీరుపై విమర్శలు

మన ఊరు మన బడి ప్రోగాం స్కూళ్ల ఎంపిక  తీరుపై విమర్శలు

నల్గొండ, వెలుగు :  సర్కారు బడులను బాగు చేయాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న మన ఊరు మన బడి ప్రోగాం కింద స్కూళ్ల ఎంపిక  తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీల్డ్​లెవెల్ లో విజిట్​చేసి సమస్యలున్న స్కూళ్లను ఎంపిక చేయకుండా డెవలప్​అయిన స్కూళ్లనే సెలెక్ట్​ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 26 వేలకు పైగా స్కూళ్లుండగా, స్కీంలో భాగంగా వీటిని మూడు విడతల్లో డెవలప్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో 5,399 ప్రైమరీ స్కూల్స్ ,1, 009 యూపీఎస్, 2,715 హైస్కూల్స్ ఉన్నాయి. ఈ బడుల్లో 12 రకాల పనులు చేయనున్నారు. ఫర్నిచర్, పెయింటింగ్, కంపౌడ్ వాల్స్, కిచెన్ షెడ్లు, టాయ్ లెట్లు, ఎలక్ర్టిసిటీ, వాటర్, కొత్త బిల్డింగ్స్​, డిజిటల్ క్లాస్ రూమ్స్, రిపేర్స్​కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటిల్లో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్​తో కొన్ని పనులు, నాన్ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్​తో మరికొన్ని పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలెక్ట్ చేసిన స్కూళ్లలో పనులు చేపట్టేందుకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు స్కూళ్ల ఎంపిక పారదర్శకంగా జరగలేదని, విద్యార్థుల సంఖ్యకే ప్రియారిటీ ఇవ్వడం వల్ల వసతులు లేని చాలా స్కూళ్లు రెండు, మూడో విడత కోసం ఎదురుచూడాల్సిన పరిస్థతి నెలకొంది.

అంతా పై వాళ్ల చేతిలోనే...

స్కూళ్ల సెలక్షన్ రాష్ట్ర స్థాయిలోనే జరిగిందని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక మండలంలో ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లను సెలెక్ట్​చేసి దాంట్లో 35 శాతం స్కూళ్లను ఫస్ట్ ఫేజ్ కింద ఎంపిక చేశారు. అయితే శిథిలావస్థకు చేరిన స్కూళ్లను వదిలేసి సంఖ్యకే ప్రాధాన్యత ఇచ్చారు. కనీస వసతుల్లేని స్కూల్స్ ను పరిగణలోకి తీసుకోలేదు. తాగునీరు, కరెంట్, టాయిలెట్లు, కిచెన్​షెడ్లు లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. పిల్లర్లు, స్లాబులు కూలిపోయే దశలో అనేక పాఠశాలలున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో ఇలాంటి స్కూళ్లకు ప్రియారిటీ ఇవ్వకుండా ఫెసిలిటీస్​ఉన్న స్కూళ్లను చేర్చారు. ఇప్పటికే ఫైనలైజ్​చేసిన లిస్టును మార్చాలని, డెవలప్​కాని పాఠశాలలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చాలా చోట్ల కలెక్టర్లు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. కానీ త మ చేతుల్లో ఏమీ లేదని, పై ఆఫీసర్లే సెలెక్ట్ చేశారని, ఒకవేళ మార్పులు చేయాల్సి వస్తే ప్రభుత్వానికి సిఫార్సు చేయడం తప్ప జిల్లాస్థాయిలో నిర్ణయం తీసుకోలేమని ఆఫీసర్లు చెబుతున్నారు.

లోకల్ లీడర్ల అసంతృప్తి

‘మన ఊరు మన బడి’  ప్రోగాంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గైడ్​లైన్స్​ప్రకారం కన్సల్ట్ ఏఈ, హెచ్ఎం, ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో వర్క్స్​జరుగుతాయి. వీరే పనులకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటారు. రూ.30 లక్షల వరకు నామినేషన్ పై చేస్తారు. ఆ పై పనులకు టెండర్లు పిలుస్తారు. ఫండ్స్ రిలీజ్, ఖర్చుల కోసం ప్రత్యేకంగా హెచ్ఎం, ఎస్ఎంసీ కమిటీ, ఏఈ, సర్పంచ్​లతో కలిపి బ్యాంకు అకౌంట్ తీయాలి. ఇలా అన్ని పనులు వేరే వాళ్లే చూస్తున్నారని, కనీసం వర్క్స్ ప్రపోజల్స్ విషయంలో కూడా ఆఫీసర్లు తమను గుర్తించడం లేదని స్థానిక నేతలు వాపోతున్నారు. పనులన్నీ కమిటీలకు అప్పగించి, ప్రచారం తమను చేయమనడం కరెక్ట్​కాదంటున్నారు. 

కార్పొరేట్​తరహాలో కనిపిస్తున్న ఈ స్కూల్​ బిల్డింగ్​ బీబీపేటలోని బాయ్స్​హైస్కూల్.  ఇందులో 365 మంది స్టూడెంట్స్​ఉన్నారు. పూర్వ విద్యార్థి సుభాష్​రెడ్డి  రూ.6 కోట్లు పెట్టి ఆధునాతన సౌకర్యాలతో స్కూల్​బిల్డింగ్​నిర్మించారు.  సరిపోను క్లాస్​ రూమ్స్​, టీచర్లు ఉన్నారు. ఫర్నిచర్, కిచెన్​రూమ్స్​, ఫిల్టర్​వాటర్, లైబ్రరీ, సైన్స్​ ల్యాబ్, రీడింగ్​రూమ్స్​ఇలా అన్ని వసతులు ఉన్నాయి. అయినా ఈ స్కూల్​ను ఫస్ట్​ విడతలో మన ఊరు  మన బడి పొగ్రామ్​కింద ఎంపిక చేశారు. ఇదే  ఊరిలో గర్ల్స్​ హై స్కూల్​లో క్లాస్​రూమ్స్​ శిథిలమయ్యాయి. ఇక్కడ వసతులు లేక స్టూడెంట్స్​ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కూల్​ను మాత్రం ఎంపిక చేయలేదు.