- ప్రభుత్వ పాలన, ప్రజా సేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు: సీఎస్
- ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ సైబర్ సేఫ్టీ తప్పనిసరి
- సైబర్ సెక్యూరిటీ, ఇన్నోవేషన్స్ లక్ష్యంగా ‘షీల్డ్ 2.0’ కాన్‌క్లేవ్
- ఆకట్టుకున్న స్టార్టప్ ఇన్నోవేషన్స్, రోబోలు
- డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు
హైదరాబాద్,వెలుగు: సైబర్‌దాడులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్సైబర్సేఫ్టీ టెక్నాలజీ వినియోగిస్తున్నామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ‘సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్నారు.. అదే టెక్నాలజీని ప్రజలు కవచంగా మార్చుకోవాలి.. అప్పుడే సైబర్అటాక్స్ను అడ్డుకోగలం..’ అని సూచించారు.ఈ క్రమంలో డిజిటల్ నేరాలను అరికట్టడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసింగ్‌లోను మార్పులు వస్తున్నాయని, ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత వర్చువల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బి) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 'షీల్డ్ 2026' రెండో ఎడిషన్'సైఫర్ స్ప్రింట్' కార్యక్రమానికి సీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్‌తో కలిసి కాన్‌క్లేవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నాని సహా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అభిషేక్ సింగ్, ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసుదేవన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు భువన్ రిభు, ఐఐఐటీ డైరెక్టర్ సందీప్ శుక్లా పాల్గొన్నారు. డార్క్ వెబ్, డీప్ ఫేక్ సహా ప్రస్తుత సైబర్ నేరాలపై ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించారు. సవాల్‌గా మారిన సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన టెక్నాలజీ గురించి చర్చించారు. ఈ మెగా ఈవెంట్‌కు వీ6, వెలుగు మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరించింది.
హైదరాబాద్ కేంద్రంగా ఇన్నోవేషన్స్: సీఎస్
టెక్నాలజీ,సైబర్‌మోసాలపై సీఎస్‌మాట్లాడుతూ.. గతంలో దొంగతనాలు లేదా అనుమానిత వ్యక్తులను గుర్తించడం ద్వారా నేరాలను అరికట్టేవాళ్లమన్నారు. కానీ నేడు ఫిషింగ్ అటాక్స్, నైజీరియన్ స్కామ్స్ సహా నకిలీ లింకుల ద్వారా అమాయకులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కూడా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నదని హైదరాబాద్ టెక్నాలజీలో సరికొత్త ఇన్నోవేషన్‌కు వేదిక అయ్యిందన్నారు. ఆర్టిఫిషియల్‌ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల భద్రత కోసం కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రజల భౌతిక భద్రతతో పాటు సైబర్ భద్రతను కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ..సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వేగంగా మారుతున్న నేర పద్ధతులు, సైబర్ క్రైమ్ దర్యాప్తు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సాంకేతికతలు, ప్రత్యేక శిక్షణ విధానాల అవసరాన్ని వెల్లడించారు.
సైబర్ సేఫ్టీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యం: సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్
సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, బాధితులకు భరోసా ఇవ్వడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొనసాగిస్తున్న'షీల్డ్ 2026' విజయవంతం అయ్యిందన్నారు. 18 రాష్ట్రాల నుంచి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు సైబర్ సేఫ్టీ, ఆర్టిఫీషియల్‌ఇంటెలిజెన్స్ వ్యవస్థపై చర్చించేందుకు వేదిక అయ్యిందని తెలిపారు. పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో కలిసి ఆవిష్కరణల ద్వారా సైబర్ సేఫ్టీ వ్యవస్థను నిర్మించడమే టీజీసీఎస్‌బీ లక్ష్యమని వివరించారు. ‘సైబర్ నేరాలు కొత్త రూపాల్లో వస్తున్నాయి, వాటిని ఎదుర్కోవాలంటే అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి. సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న ఏఐ, డార్క్ వెబ్ వంటి టెక్నాలజీకి కౌంటర్‌గా సరికొత్త ఇన్నోవేషన్స్ రూపొందించడమే షీల్డ్‌కాన్‌క్లేవ్ లక్ష్యం కావాలి’ అని సూచించారు.
అదరగొట్టిన రోబో డ్యాన్స్
కాన్‌క్లేవ్‌లో టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జాతీయ స్థాయి సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ‘సైఫర్ స్ప్రింట్’లో 17 ఫైనలిస్ట్ బృందాలు తమ పరిష్కారాలను ప్రదర్శించాయి. విజేతలకు రూ. 5 లక్షల గ్రాంట్‌తో పాటు టీజీసీఎస్‌బీతో కలిసి పని చేసే అవకాశం కల్పించారు. స్టార్టప్ కంపెనీలు రూపొందించిన సరికొత్త ఇన్నోవేషన్‌లు ఆకట్టు కున్నాయి. రోబోటిక్ డాగ్, హ్యూమనాయిడ్ రోబోలు డ్యాన్సులతో అదరగొట్టాయి. ఈ క్రమంలోనే ఫ్లైట్ సిమ్యులే టర్లు, డ్రోన్, కౌంటర్ -డ్రోన్ టెక్నాలజీలు, భద్రతా బలగాలకు ఏఐ ఆధారిత పరిష్కారాలతో రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్ కాన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు ఆసరగా సారథి పేరిట1930 హెల్ప్‌లైన్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ఆధారిత వాయిస్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్‌ను సీఎస్, డీజీపీ ఆవిష్కరించారు. సీ సైట్‌డిజిటల్ ప్లాట్‌ఫారమ్, పోలీసింగ్, శిక్షణ, సైబర్ రక్షణ సంబంధించి రూపొందించిన పలు ఇన్నోవేషన్స్ ఆకట్టుకున్నాయి.
పైరసీతో ఇండస్ట్రీకి నష్టం
పైరసీ సినిమాలతో ఇండస్ట్రీతో పాటు అలాంటి సినిమాలు చూసే వాళ్లు నష్టపో తున్నారు. పైరసీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీకి నష్టం అనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తించాలి. పైరసీలో సినిమాలు చూడడం దొంగతనం కిందికే వస్తుంది. దొంగతనం చేసిన డబ్బు, వస్తువు తీసుకోలేం కదా. పైరసీ చేసిన సినిమాలు కూడా దొంగత నంగా చేసినవే. ఇలాంటి వాటితో వ్యక్తిగత ప్రవర్తన లోనూ ఆ తరహా మార్పు వస్తుంది. ఇండస్ట్రీ సహా ఇంకెవరో చెప్తే కాదు పైరసీ చూసేవా రిలో మార్పు వచ్చినప్పుడే కట్టడి సాధ్యం.
- సినీ హీరో నాని
