సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్లు కొట్టేసిన్రు

సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్లు కొట్టేసిన్రు
  •     వేర్వేరు కేసుల్లో మోసపోయిన బాధితులు
  •     సైబర్ క్రైమ్ పీఎస్​లో ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు : సిటీకి చెందిన వేర్వేరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2 కోట్లకు పైగా కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్​కు చెందిన సూర్యలతకు స్పిన్నింగ్ మిల్​ కంపెనీ ఉంది. రూ.కోటి 40 లక్షల  విలువైన మెటీరియల్ ​కోసం బ్రిటన్​కు చెందిన ఓ కంపెనీతో  ఆమె అగ్రిమెంట్ చేసుకుంది. మొదటగా రూ. 47 లక్షలను ఆన్​లైన్​లో ట్రాన్స్​ఫర్ చేసింది. ఆ తర్వాత ఆమె మెయిల్​కు ఓ మెసేజ్​ వచ్చింది.

 మిగతా డబ్బులను వేరే అకౌంట్​కు పంపాలని బ్రిటన్​కు చెందిన కంపెనీ తరఫున ఆ మెయిల్ మెసేజ్​ ఉంది. దీన్ని నమ్మిన సూర్యలత రూ. 93 లక్షలను ఆ అకౌంట్​కు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పింది.  తమకు అమౌంట్ రాలేదని, మెయిల్ కూడా చేయలేదని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో  మోసపోయినట్లు గుర్తించిన సూర్యలత గుర్తించి సైబర్ క్రైమ్​ పోలీసులకు కంప్లయింట్ చేసింది. 

మిగతా మోసాలు ఇలా.. 

  •     క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని బోరబండకు చెందిన ఓ వృద్ధురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఆమెతో పలు దఫాలుగా రూ. 63 లక్షలు         ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారు 
  •     యూట్యూబ్ , ఫేస్​బుక్​లో లైక్స్​ కొడితే పైసలిస్తమని, పార్ట్ టైం జాబ్ అని చెప్పి సికింద్రాబాద్​కు చెందిన   వ్యక్తిని మోసం చేసి రూ.47 లక్షలు కొట్టేశారు. 
  •      ఐఆర్టీసీలో ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ పేరుతో ఫేక్​ కస్టమర్ కేర్ నంబర్​ ను క్రియేట్ చేసి మరో వ్యక్తి నుంచి  రూ. 5 లక్షల 40 వేలు కాజేశారు.