- అడ్డదిడ్డంగా వరంగల్ స్మార్ట్ సిటీ పనులు
- కేటీఆర్ మెచ్చుకున్న రూ.2 కోట్ల సైకిల్ ట్రాక్‍పై.. హరితహారం గుంతలు
- ట్రైసిటీ మెయిన్ రోడ్లపైనే బోరింగులు, కరెంట్ పోల్స్
- కోట్ల రూపాయల స్మార్ట్‌సిటీ ఫండ్స్ మిస్‍యూజ్
వరంగల్ రూరల్, వెలుగు: ఆరోగ్య తెలంగాణ కావాలంటే సైకిల్ తొక్కాలంటూ కోట్ల రూపాయలు ఖర్చుచేసి వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఎర్రటి సైకిల్ ట్రాక్‍పై ఇప్పుడు అడుగుకో హరితహారం గుంత కనిపిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో లక్షల రూపాయలు పెట్టి కట్టిన కేఫ్టాయిలెట్లు నెల తిరిగేసరికి నేలమట్టమయ్యాయి. రయ్‍రయ్‍మంటూ వెహికల్స్ తిరిగే మెయిన్ రోడ్డు మధ్యలో బోరింగ్ పంపులు, కరెంట్ పోల్స్ అడ్డుపడుతున్నాయి. మంత్రి కేటీఆర్ స్వయంగా హాజరై ఓపెన్ చేసిన వాటర్ ఫౌంటెయిన్లు అప్పుడే మొరాయిస్తున్నాయి. లోకల్ లీడర్లు, ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేని ఇంజనీర్ల ప్లాన్లు, కాంట్రాక్టర్ల క్వాలిటీ లేని పనులతో కోట్ల రూపాయల స్మార్ట్‌సిటీ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయి.
సైకిల్ ట్రాక్‍పై అడుగుకో మొక్క
‘ఇండియా సైకిల్ ఫర్ చేంజ్’ పేరుతో వరంగల్ ట్రైసిటీ ఎన్‍ఐటీ ప్రాంతంలోని మెయిన్ రోడ్లపై సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మున్సిపల్‍శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‍లో ఈ ఫోటోలు పెట్టి పనులను, ఆఫీసర్లను ఎంతో మెచ్చుకున్నారు. దాదాపు రూ.2 కోట్లతో చేపట్టిన సైకిల్ట్రాక్పనులు ప్లానింగ్ లేకుడా ఇష్టం వచ్చినట్లు చేశారు. సైకిల్ ట్రాక్ ఓచోట 15 అడుగులు ఉంటే.. కొన్నిచోట్ల కనీసం రెండు అడుగులు కూడా లేని దుస్థితి కనిపించింది. షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ట్రాక్‍పై దిమ్మెలు అడ్డు కట్టారు. ఇవి చాలవన్నట్లు పలుచోట్ల కరెంట్ పోల్స్ అడ్డం వచ్చాయి. ఎవరి షాప్ ముందు వారు బైకులు పార్క్ చేశారు. దీంతో ట్రాక్‍పై ఎలాంటి అడ్డంకులు లేకుండా వంద మీటర్లు కూడా సైకిల్తొక్కలేని పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటాం, బెంగళూర్, ముంబై తరహాలో బెస్ట్ ట్రాక్ అనుకునేలా చేస్తామన్నారు. తీరా రెండు నెలల తర్వాత చూస్తే.. హరితహారం పేరుతో ఉన్న ట్రాక్‍పై గడ్డపారలతో అడుగుకో గుంత తవ్వి మొక్కలు నాటుతున్నారు. కోట్ల రూపాయల ట్రాక్ అఫిషియల్‍గా ఇంకా ఓపెన్ అవకముందే.. ఎక్కడికక్కడ తవ్వుతున్నా లీడర్లు, ఆఫీసర్లు ఎవరికీ పట్టడం లేదు.
నడిరోడ్లపై బోరింగులు, కరెంట్ స్తంభాలు
వరంగల్ ట్రైసిటీలో స్మార్ట్ సిటీ ఫండ్స్ తో చేపడుతున్న 11 స్మార్ట్ రోడ్లకు కరెంట్ పోల్స్ అడ్డుగా ఉన్నాయి. పోచమ్మమైదాన్, లేబర్ కాలనీ, వెంకట్రామ టాకీస్ వంటి ప్రాంతాల్లో పనులకు ఇవి అడ్డుగా ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఎక్కడ పడితే అక్కడ బైకులు మునిగే లోతులో గుంతలు తీసి వదిలేశారు. ఇవేగాక కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ అబ్బనికుంట ప్రాంతంలో నడిరోడ్డుపై ఓ మంచినీటి బోరింగ్ అడ్డుగా ఉన్నా.. దానిని అలానే ఉంచి అటు ఇటు రోడ్డు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హన్మకొండ నయీంనగర్ నుంచి పోచమ్మకుంట వెళ్లే దారిలో పదుల సంఖ్యలో కరెంట్ పోల్స్ అడ్డుగా ఉన్నా.. వాటిని తొలగించకుండా రోడ్డు వేశారు. పెగడపల్లి డబ్బాలు నుంచి గుండ్లసింగారం వెళ్లే రోడ్డులో డ్రైనేజీకి అడ్డుగా కరెంట్ స్తంభాలు వచ్చినా అలానే ఉంచి కట్టేశారు. దీంతో చిన్నపాటి వానలకే వరదనీరు రోడ్లమీదకు వస్తోంది.
ఫౌంటెయిన్‍కు రిపేర్ల మీద రిపేర్లు
గ్రేటర్ ఎలక్షన్ టైంలో మంత్రి కేటీఆర్ వరంగల్ సిటీ పర్యటనకు వచ్చారు. కుడా ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో డెవలప్ చేశామని చెప్పి అంబేద్కర్ జంక్షన్ పనులను ప్రారంభించారు. మినిస్టర్ అక్కడ ఉండగానే మధ్యలో ఉన్న ఫౌంటెయిన్ ఆన్ చేస్తే పని చేయలేదు. ఒకటికి రెండుసార్లు రిపేర్ చేసినా పనిచేయలేదు. దీంతో మళ్లీ దానిని ఐదారుసార్లు విప్పి కుప్పపెట్టారు. అది ఏ రోజు పనిచేస్తుందో ఏరోజు సతాయిస్తుందో చెప్పలేని పరిస్థితి.
లీడర్లు పట్టించుకోరు..ఆఫీసర్లు అడగరు
డెవలప్‍మెంట్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులే లేకుండా పోయారు. రివ్యూలు పెట్టి మిస్టేక్ చేసినవారిపై చర్యలు తీసుకోవట్లేదు. సిటీ అంతటా కొత్త రోడ్లు వేశాక నాలుగు రోజులకే మళ్లీ ఏదో పేరు చెప్పి తవ్వుతున్నా ఊరుకుంటున్నారు. దీంతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్‍లు, రోడ్లు, జంక్షన్లు, పార్కు పనులు మూడు రోజుల మురిపంగా మారి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.
రూ.16 లక్షలతో ‘లూ కేఫ్’ కట్టి.. కూల్చేసిన్రు
వరంగల్ ట్రైసిటీలో టాయిలెట్లు కట్టే క్రమంలో.. కార్పొరేట్ స్థాయిలో మొత్తంగా 6 ‘లూ కేఫ్ టాయిలెట్ల’కు శ్రీకారం చుట్టారు. ఒక్కో దానికి రూ.16 లక్షలు ఖర్చుచేసి లైటింగ్, డిజైన్ ఫ్లోరింగ్, రెండు మెన్, రెండు షీ టాయిలెట్లు, బాత్రూంలు, స్పెషియస్ వాష్ బేసిన్, బేబి ఫీడింగ్ రూంలతో పాటు కాఫీ సెంటర్ ఉండేలా టెక్నాలజీకి అనుగుణంగా నిర్మించారు. ఇందులో ఒకటి ప్రస్తుత వరంగల్ అర్బన్ కలెక్టరేట్‍కు ఆనుకుని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‍భాస్కర్, కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు, కమిషనర్ గెస్టులుగా హాజరై దీనిని ప్రారంభించి కాఫీ టేస్ట్ చూశారు. తీరా చూస్తే.. కలెక్టరేట్ ఓపెనింగ్ కోసం జూన్ 21న సీఎం కేసీఆర్ రాకకు రెండు రోజుల ముందు హడావుడిగా దానిని నేలమట్టం చేశారు. ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. లక్షల రూపాయల స్మార్ట్‌సిటీ ఫండ్ వృథా చేశారు.
