పంజాగుట్ట, వెలుగు: ఖైరతాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్ ఎన్బీటీనగర్లో ఓ దళిత కుటుంబంపై చుట్టుపక్కల వారు దాడి చేశారు. శంకర్, సునీతరాణి దంపతులు ఇద్దరు పిల్లలతో ఎన్బీటీ నగర్లో ఉంటున్నారు. ఈ మధ్య సొంతింటి నిర్మాణం మొదలుపెట్టగా.. 22న ఇంటి సమీపంలో ఉండే బ్రహ్మయ్య, శివకుమార్, మల్లేశ్, మాధవి కలిసి శంకర్‌తో గొడవకు దిగారు.
దళితులు తమ పక్కన ఉండడానికి వీల్లేదంటూ బూతు పురాణం మొదలు పెట్టారు. దీంతో శంకర్కొడుకు మేఘనాథ్ అడ్డుపడగా దాడి చేశారు. అతడు సృహతప్పి పడిపోగా దవాఖానకు కూడా తీసుకువెళ్లనివ్వకుండా అడ్డుపడ్డారు. డయల్100కు కాల్చేయగా.. పోలీసులు వచ్చి హాస్పిటల్‌కు తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు భైండ్ల శ్రీనివాస్ బాధితులను శుక్రవారం పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంజారా హిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డిని కోరారు.
