ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు

ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు

నల్గొండ, వెలుగు : దళితబంధు స్కీంను మొదటి విడత ప్రతి నియోజకవర్గంలోని 100 కుటుంబాల్లో అమలు చేస్తామని చెప్పిన సర్కారు తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను సెలెక్ట్  చేస్తే గ్రామాల్లో గొడవలవుతాయని, ఎన్నికల ముందు ఇది తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. దీంతో నియోజవర్గం నుంచి 100 మందికి బదులు ఒక్కో నియోజకవర్గంలోని ఏవైనా రెండు గ్రామాలను ఎంపిక చేసి, ఫిబ్రవరి 5 లోగా తమకు ప్రపోజల్స్​ పంపించాలని తాజాగా సీఎంఓ నుంచి ఓరల్​ ఆర్డర్స్​ వచ్చాయి. దీంతో ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. 

ఐదు,పది మందికే వస్తుందని..

ఎస్సీ వెల్ఫేర్​ మినిస్టర్​ కొప్పుల ఈశ్వర్ మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్లతో దళితబంధుపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను సెలెక్ట్​ చేయాలని ఆదేశించారు. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఎంత లేదన్నా కనీసం మూడు నుంచి ఐదారు మండలాల వరకు ఉంటాయి. వీటి పరిధిలో ఎస్సీ జనాభా కలిగిన విలేజ్​లు 200 నుంచి 300 వరకు ఉంటాయి. నియోజకవర్గం మొత్తం వంద మంది అంటే మండలానికి, పది నుంచి ఇరవై మందికి మాత్రమే స్కీం వర్తిస్తుంది. ఒక్కో గ్రామంలో ఒక్కరిని కూడా సెలెక్ట్​ చేసే పరిస్థితి ఉండదు. ఒకరిని ఎంపిక చేస్తే మిగిలినవాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. రాబోయేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఇది తమకు ఇబ్బందిగా మారుతుందని ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి, మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే నియోజకవర్గంలో ఏదైనా రెండు విలేజ్​లను ఎంపిక చేసుకొని అక్కడున్న వారికి స్కీం వర్తింపజేస్తే బాగుంటుందనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.  

చిన్న గ్రామాలకే ప్రియారిటీ..

దళితబంధు కింద లబ్ధిదారులను సెలెక్ట్ ​చేసే కమిటీకి కలెక్టర్ చైర్మన్​గా ఉంటారు. కానీ ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతుంది. నియోజకవర్గంలో ఏ గ్రామాలను ఎంపిక చేయాలన్న విషయంలో ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్. దీంతో గొడవలకు ఆస్కారం లేకుండా, తమకు రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఎమ్మెల్యేలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ జనాభా ఉన్న విలేజ్​లను ఎంపిక చేసుకుంటే ఫస్ట్​ఫేజ్​ గండం నుంచి గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. అలాగే పార్టీ బలం ఏ మండలంలో ఎక్కువగా ఉందో చూసుకుని అక్కడే లబ్ధిదారులను సెలెక్ట్​ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.  

అప్పటిదాకా ఆఫీసర్లు, కలెక్టర్లు మాట్లాడొద్దు 

దళితబంధు స్కీం అమలు, గ్రామాల ఎంపికకు సంబంధించి కలెక్టర్లతో పాటు, మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రులు వచ్చి మీటింగులు పెట్టేవరకు ఇటు ఆఫీసర్లు, అటు కలెక్టర్లు సైతం నోరు విప్పొద్దని స్ట్రిక్ట్​గా ఆదేశాలున్నాయి. మంత్రుల మీటింగుల్లోనే స్కీంకు సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. గ్రామ, మండల కమిటీల ఆధ్వర్యంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి వచ్చే ప్రపోజల్స్ ఆధారంగానే కలెక్టర్లు నివేదికలు రెడీ చేస్తారు. మొత్తం ప్రక్రియ అంతా ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కీంకు సంబంధించిన ఫండ్స్ కలెక్టర్ల అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు సమాచారం.

సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగేనా..!

లబ్ధిదారుల సెలెక్షన్ కోసం గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయని, వాటి ఆధ్వర్యంలోనే  ఎంపిక జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగులు పెట్టి మార్గదర్శకాలు ప్రకటిస్తారని అంటున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి మీటింగులు పెట్టలేదు.  నియోజకవర్గానికి వంద యూనిట్లు మాత్రమే సాంక్షన్ చేయడం, అవి కూడా రెండు గ్రామాలకే పరిమితం చేయాలని చూస్తుండడం, ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్​అని ఇన్​డైరెక్ట్​గా చెబుతుండడంతో  అనుమానాలు కలుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో మాత్రం జిల్లా మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టాకే గైడ్​లైన్స్​ ప్రకటిస్తామని ఆఫీసర్లంటున్నారు. కానీ ఇప్పటి దాకా మీటింగ్ ​నిర్వహించలేదు. పైగా లబ్ధిదారులను ఫైనల్ చేయడానికి 5 రోజులే ఉండడంతో ఎస్సీ సంఘాలకు చెందినవారు.. ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కలెక్టర్  ఆధ్వర్యంలో మీటింగ్ జరిగాకే ఏదైనా బయటికి చెప్పడం ఉంటుందని ఆఫీసర్లు దాటవేస్తున్నారు.