V6 News

అన్ని వర్గాలకూ డిక్లరేషన్లు: కాంగ్రెస్ నిర్ణయం

అన్ని వర్గాలకూ డిక్లరేషన్లు: కాంగ్రెస్ నిర్ణయం
  • విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
  • 26న చేవెళ్లలో ఖర్గే సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​  
  • 29న వరంగల్​కు రాహుల్.. మైనారిటీ డిక్లరేషన్  
  • వచ్చే నెల 6 లేదా 9న సిద్ధరామయ్య రాక.. ఓబీసీ డిక్లరేషన్   
  •  21 నుంచి నియోజకవర్గాల్లో మీటింగ్స్: రేవంత్​ 

హైదరాబాద్, వెలుగు: ఇకపై వరుస డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్​లను ప్రకటించిన పార్టీ నేతలు.. ఇప్పుడు అదే కోవలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ఓబీసీ, మహిళా డిక్లరేషన్లను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. శనివారం గాంధీభవన్​లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
 ఈ నెల 26న చేవెళ్లలో ప్రజాగర్జన సభను నిర్వహిస్తామని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని చెప్పారు. ఈ సభలోనే ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను విడుదల చేస్తారన్నారు. సోమవారం నుంచి 25వ తేదీ వరకు  అన్ని నియోజకవర్గాల్లోనూ క్షేత్రస్థాయి సమావేశాలను నిర్వహించాల్సిందిగా కేడర్​ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 
ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ చేరేలా చూడాలని కేడర్ కు పిలుపునిచ్చారు. దీనికోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్​ను ప్రకటిస్తామని, వరంగల్​లో భారీ బహిరంగ సభ పెడతామని వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిసింది. 
ఇక ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీలను నియమిస్తామని రేవంత్ చెప్పారు. వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ మధ్యన ఓబీసీ డిక్లరేషన్​ను ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత మహిళా డిక్లరేషన్​ను పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రకటిస్తారన్నారు. సెప్టెంబర్17న పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.  


ప్రజల్లోకి వెళ్లండి: ఠాక్రే 


చేవెళ్ల ప్రజాగర్జన సభను విజయవంతం చేసే బాధ్యత అందరిపైనా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు, చార్జిషీట్లు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కర్నాటక తరహాలోనే కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలన్నారు. 
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలానే దీనినీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్లపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. లోక్​సభ నియోజకవర్గ ఇన్​చార్జ్​లుగా ఉన్న పార్టీ వైస్​ప్రెసిడెంట్లపైనా అసహనం వ్యక్తం చేశారని సమాచారం. 
వారికి అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని, ఇలాగైతే కష్టమని చురకలంటించినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం పట్ల ఫైర్ అయ్యారని, పనితీరు మార్చుకోవాలని హితవు చెప్పినట్టు తెలిసింది.

కాంగ్రెస్​కు70 సీట్లొస్తయ్: ఉత్తమ్​ 

అక్టోబర్ 6 నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 70 సీట్లు గెలుస్తుందన్నారు. ఎంఐఎంకి 6 స్థానాలు వస్తాయన్నారు. బీజేపీ అసలు పోటీలోనే లేదన్నారు. టికెట్ ఆశావహులు ఎందరున్నా వాళ్లంతా ప్రజలను కలవాలని, ప్రచారం చేసుకోవాలన్నారు. 

మనకు సింపతీని మనమే క్రియేట్​ చేసుకోగలగాలని సూచించారు. టికెట్ వస్తేనే పని చేస్తామంటే కష్టమని, వచ్చినా రాకున్నా పనిచేయాలని చెప్పారు. టికెట్లపై ఏఐసీసీ సర్వే చేయిస్తున్నదని, దాని ప్రకారమే సీట్లు వస్తాయన్నారు. కర్నాటకలో 90 శాతం మంది ముస్లింలు కాంగ్రెస్​వైపే నిలిచారని అన్నారు. ఎంఐఎంకి పట్టున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు కాస్తంత కష్టపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేలు నియంతల్లా, సామంత రాజుల్లాగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఎండగట్టాలన్నారు.