దుబాయ్ అనగానే అందరికీ గుర్తొచ్చే అద్భుత కట్టడం 'బుర్జ్ అల్ అరబ్'. గత 25 ఏళ్లుగా ప్రపంచ ధనవంతులు, రాజకుటుంబీకులు, సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందించిన ఈ హోటల్, ఇప్పుడు ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. భారీ రిపేర్ల పనుల కోసం ఈ హోటల్‌ను 18 నెలల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రిపేర్లు ఎందుకు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటిగా ఉన్న దీని ఖ్యాతిని భవిష్యత్తు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ట్రిస్టన్ ఆయెర్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. బుర్జ్ అల్ అరబ్ ఒక హోటల్ మాత్రమే కాదు, అది దుబాయ్ గౌరవానికి చిహ్నం అని పేర్కొన్నారు. దాని పాత అందాన్ని చెడగొట్టకుండా, ఆధునిక హంగులను అద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.
బుర్జ్ అల్ అరబ్ ప్రత్యేకతలు
బుర్జ్ అల్ అరబ్ అరేబియా పడవ నుండి ప్రేరణ పొంది, వాస్తుశిల్పి టామ్ రైట్ దీనిని రూపొందించారు. ఇది సముద్ర తీరానికి 280 మీటర్ల దూరంలో సముద్రంపై నిర్మించిన కృత్రిమ ద్వీపంలో ఉంది. 1999లో దీని నిర్మాణం పూర్తయింది. విలాసానికి మారుపేరుగా నిలిచినా దీని లోపల బంగారు పూత అలంకరణలు, ఖరీదైన మార్బుల్, అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. సుమారు 1 బిలియన్ డాలర్ల అంటే 10 వేల కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.
దుబాయ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాలనే షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆశయానికి ఇది ప్రతిరూపం. ఇటీవలే చిన్న చిన్న భద్రతా పరమైన ఘటనలు వార్తల్లోకి వచ్చినప్పటికీ, వాటితో సంబంధం లేకుండా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఆధునీకరణ జరుగుతోంది. 18 నెలల తర్వాత ఈ 'బుర్జ్ అల్ అరబ్' సరికొత్త హంగులు, మెరుపులతో ప్రపంచాన్ని అలరించనుంది.

