బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు.. పర్మినెంట్ ఉద్యోగులతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు.. బ్యాంకు లావాదేవీల కీలక సమాచారం రాబట్టాడు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా బ్యాంకుకు చెందిన ఇతర బ్రాంచిలలోని ఖాతాలనుంచి కోట్లు కాజేశాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎస్బీఐ బ్రాంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి..హైదరాబాద్ లోని పలు ఎస్బీఐ బ్రాంచిలలో ఖాతాలనుంచి రూ.2కోట్ల 65లక్షలు కాజేసిన షాకింగ్ ఘటన రాష్ట్రావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లా దేవరకొండ లోని ఎస్బీఐ బ్రాంచిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న చక్రపాణి అనే వ్యక్తి.. హైదరాబాద్ లోని పలు ఎస్బీఐ బ్రాంచిలలోని ఖాతాలనుంచి రూ. 2కోట్ల 65 లక్షలు తన ఖాతాలకు మళ్లించుకున్న భారీ స్కాం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత కాలం క్రింతం దేవరకొండ బ్రాంచి కాంట్రాక్టు ఉద్యోగి చేరిన చక్రపాణి.. పర్మినెంట్ ఉద్యోగులతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. లంచ్ టైం, టీం వంటి రిలాక్సేషన్ సమయాల్లో ఉద్యోగులను కంప్యూటర్ల పాస్ వర్డ్, ఖాతాల వివరాలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టాడు. అదును చూసి ఎస్బీఐలోని ఖాతాదారుల అకౌంట్స్ నుంచి డబ్బును దారి మళ్లించాడు.
పనిచేస్తున్న బ్రాంచిలో ఫ్రాడ్ చేస్తే దొరికిపోతామని భావించి.. అదే ఎస్బీఐ బ్యాంకు బ్రాంచిలను ఖాతాలపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పలు బ్రాంచిలలో పెద్దగా నగదు బదిలీలు కానీ ఎకౌంట్స్ ను ఎంచుకొని డబ్బులను డ్రా చేశాడు. అకౌంట్ కేవైసీ అప్డేట్ కోసం నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తన ఫోన్ నంబర్ ను వారి అకౌంట్స్ కి అప్డేట్ చేయడం, దేవరకొండ ఎస్బిఐ బ్యాంక్ నుంచి ఆపరేట్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగి చక్రపాణి తన అకౌంటుకు డబ్బులను మళ్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఓ బ్యాంక్ ఖాతాదారుడి ఫోన్ కు బ్యాంకు లావాదేవీలు జరిగినట్టు సమాచారం రావడంతో బ్యాంక్ అధికారులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు అకౌంట్ హోల్డ్ చేసి దారి మళ్ళిన తీరును పరిశీలించి కాంట్రాక్టు ఉద్యోగి చక్రపాణి ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. దారి మళ్లించిన రూ. 2 కోట్ల 65 లక్షల డబ్బుల నుంచి రూ.89 లక్షల 48 వేలు రికవరీ చేశారు. ప్రస్తుతం నిందితుడు చక్రపాణి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చక్రపాణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

