టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లో ఓ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐసర్ కాలిక్ సెకండరీ స్కూల్‌లో ఓ దుండగుడు జరిపిన ఈ దాడిలో నలుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం... స్కూల్ టైంలో దుండగుడు ఒక్కసారిగా తుపాకీతో లోపలికి వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో విద్యార్థులు, టీచర్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్కూల్ ప్రదేశాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.
టర్కీలో కేవలం 24 గంటల వ్యవధిలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. నిన్ననే ఒక దుండగుడు 16 మందిపై కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే, ఇప్పుడు ఓ స్కూల్ ని టార్గెట్ చేసి దాడి జరగడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి.. దుండగుడు ఎవరు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస దాడుల నేపథ్యంలో విద్యా సంస్థల వద్ద భద్రతను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక గవర్నర్ ముకెర్రమ్ ఉన్లూర్ ఈ ఘటన పై బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. స్కూల్స్ వంటి ప్రదేశాల్లో ఇలాంటి హింస జరగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

