దారినపోయే దాన్ని తలకెత్తుకోవటం అంటే ఇదే.. ఈ కలికాలంలో అమ్మా అని పిలిచినా బూతుగా వినిపిస్తుంది పగోళ్లకు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సరిగ్గా ఇలాగే ఉంది. బయట ఓ కార్యక్రమానికి హాజరై తెల్లవారుజామున తిరిగి ఇంటికి వెళుతున్నాడు ఓ వ్యాపారవేత్త.. వెదర్ కూల్‌గా ఉందని ఓ టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతున్నాడు. అదే సమయంలో ఓ నలుగురు వ్యక్తులు.. ఓ మహిళను వేధిస్తున్నారు.. చూస్తూ ఉండలేక ఆ పోకిరిలను వారించాడు.. సుద్దులు చెప్పాడు.. ఆ తర్వాత.. ఆ నలుగురు కలిసి ఆ వ్యాపారవేత్తను చితక్కొట్టారు.. నీకేం పని.. నీకెందుకురా అంటూ వ్యాపారవేత్తను రోడ్డుపై బాదిపడేశారు.. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముఖేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలోని సంగం విహార్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం (ఫిబ్రవరి 3) ఓ వివాహనికి వెళ్లి అర్థరాత్రి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఇగ్నో రోడ్‌లోని ఒక స్టాల్ దగ్గర టీ తాగేందుకు ఆగాడు. ఇదే సమయంలో టీ స్టాల్ దగ్గర నలుగురు పోకిరీలు ఓ యువతిని వేధిస్తున్నారు. మహిళను వేధింపులకు గురి చేయడం చూడలేకపోయిన ముఖేష్ కుమార్ వద్దని యువకులను వారించాడు.
ఈ క్రమంలో ముఖేష్ కుమార్‌కు ఆ యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకులు అసలు మధ్యలో నువ్వు ఎవడంటూ ముఖేష్ కుమార్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. రోడ్డుపై పడేసి బట్టలు చించి పిడిగుద్దులు గుద్దారు. కాలితో తన్నారు. ఇటుకలతో దాడి చేశారు. చివరకు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన వదలకుండా కొట్టారు.వేధింపులకు గురైన మహిళల్లో ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన ముఖేష్ కుమార్‌ను పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆసుపత్రికి తరలించారు. కండిషన్ క్రిటికల్‌గా ఉండటంతో ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు.
సంగం విహార్ నివాసితులు అయిన విశాల్ రావత్ (26), జతిన్ (20), సోను (25), వివేక్ (20) అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో విచారిస్తోన్నట్లు తెలిపారు. ముఖేష్ కుమార్ పై దాడికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
A transport businessman, Mukesh, was beaten up in Delhi's Mehrauli area for intervening when some men were harassing a young woman. The incident occurred on February 3. Police have arrested all 4 accused. Sounds like a really disturbing incident! #DelhiPolice pic.twitter.com/U4GanOEiuR
— Abhinav (@Abhinav_gloria) February 4, 2026
