ఈ లడ్డూలు తింటే.. 2 లక్షలు రూ.3 కోట్లు అవుతాయా.. : ఢిల్లీ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్

ఈ లడ్డూలు తింటే.. 2 లక్షలు రూ.3 కోట్లు అవుతాయా.. : ఢిల్లీ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్

ఢిల్లీలోని పీరాగఢీ ఫ్లైఓవర్ సమీపంలో కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు దేశవ్యాప్తంగా దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ మిస్టరీని ఛేదించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలను తెలుసుకున్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక దొంగ బాబా అసలు స్వరూపం బయటపెట్టారు. డబ్బును రెట్టింపు చేస్తానంటూ ఆశ చూపి.. విషంతో ప్రాణాలు తీసే 72 ఏళ్ల కమ్రుద్దీన్ అనే మాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.2 లక్షలు ఇస్తే రూ.3 కోట్లు.. ఆశే శాపమైంది

ఈ దొంగ బాబా నెట్ వర్క్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తరించింది. తాజాగా ఢిల్లీకి చెందిన బాధితులకు కమ్రుద్దీన్ ఒక నమ్మశక్యం కాని ఆశ చూపాడు. తన వద్ద ఉన్న అతీంద్రియ శక్తులతో రూ.2 లక్షలను ఏకంగా రూ.3 కోట్లుగా మార్చి ధనవర్షం కురిపిస్తానంటూ నమ్మించాడు. మరణించిన బాధితుల్లో ఒకరైన రణధీర్ ఒక సంపన్న ప్రాపర్టీ డీలర్. ఆర్థికంగా నిలకడగా ఉన్నప్పటికీ.. దొంగబాబా మాటలు నమ్మి తన స్నేహితులతో కలిసి కారులో అతడిని కలవడానికి వెళ్లాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

విషపు లడ్డూలతో ఖతం..

ఫేక్ బాబా కమ్రుద్దీన్ తన నేరాల కోసం ఒకే పద్ధతిని అనుసరిస్తున్నాడు. పూజల పేరుతో బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు పిలిపించి.. వారికి విషం కలిపిన లడ్డూలను ప్రసాదంగా ఇస్తాడు. పీరాగఢీ కేసులో కూడా కారులో ఉన్న ముగ్గురికి ఇలాగే విషం కలిపిన లడ్డూలు ఇచ్చి చంపేశాడు. కారులో మృతదేహాలను గుర్తించినప్పుడు అక్కడ ఘాటైన విషపు వాసన రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ స్పీడప్ చేశారు. చివరకు కమ్రుద్దీన్‌ను ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతంలో గుర్తించి అరెస్ట్ చేశారు.

గతంలోనూ ఇదే తరహా హత్యలు..

కమ్రుద్దీన్ ఒక అలవాటు పడిన నేరస్తుడని పోలీసుల విచారణలో తేలింది. 2014లో రాజస్థాన్ ధోల్‌పూర్‌లో ఒక మహిళను హత్య చేసిన ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. ఆ తర్వాత 2023 యూపీలో ఇద్దరు వ్యక్తులకు గుప్త నిధులు ఇప్పిస్తానని నమ్మించి విషం ఇచ్చి చంపేశాడు. అప్పట్లో వారి వద్ద నుండి రూ.5 లక్షలు కాజేసినట్లు తేలింది. దుప్పట్లలో నుంచి డబ్బులు రప్పించే శక్తి ఉందని.. అనారోగ్యాలను నయం చేస్తానని విజిటింగ్ కార్డులు కూడా ముద్రించి ప్రచారం చేసుకునేవాడు ఈ దొంగ బాబా. మంత్రాలు తంత్రాలు చేతబడులు అంటూ ఈ బాబా చేయని పని లేదు. అలా ప్రజలను ఆకట్టుకోవటం డబ్బు గుంజటం వారికి విషం ఇచ్చి చంపేయటం ఆనవాయితీగా మార్చుకున్నాడు.

అత్యాశను ఆసరాగా చేసుకుని..

కమ్రుద్దీన్ ప్రజల బలహీనతలను, ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుంటాడు. బాధితులు భావోద్వేగంగా లొంగిపోయిన తర్వాత.. వారి వద్ద ఉన్న డబ్బును తీసుకుని సాక్ష్యం లేకుండా చంపేయడం ఇతని రొటీన్ ప్లాన్. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఇతడిపై హత్య కేసులు నమోదు చేశారు. ఇంకా ఎన్ని హత్యలు చేశాడనే కోణంలో విచారణ కొనసాగుతోంది.