తండ్రి ఇంటి ముందే ఇద్దరు పిల్లల ఖననం.. పంటచేలో స్రవంతి దహనం.. వరంగల్ జిల్లాలో ఘటన

తండ్రి ఇంటి ముందే ఇద్దరు పిల్లల  ఖననం.. పంటచేలో స్రవంతి దహనం.. వరంగల్ జిల్లాలో ఘటన
  • పిల్లలతో కలిసి రెండ్రోజుల క్రితం తల్లి ఆత్మహత్య
  • భర్త వేధింపులే కారణమని బంధువుల ఆగ్రహం

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: భర్త వేధింపుల కారణంగా ఇద్దరు కొడుకులతో సహా భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆగ్రహించిన గ్రామస్తులు భర్త ఇంటి ముందే బిడ్డలను ఖననం చేయడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

 తండాకు చెందిన ప్రవీణ్​, స్రవంతి తన ఇద్దరు కొడుకులు కార్తీక్‍(10), కౌశిక్‍ (8)తో కలిసి హైదరాబాద్​లోని మియాపూర్​లో నివాసముంటున్నారు. ప్రవీణ్, తన బంధువైన ఓ అమ్మాయిని రెండోపెళ్లి చేసుకొని స్రవంతిని వేధిస్తుండడంతో ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి మంగళవారం రాత్రి మియాపూర్​లో ఆత్మహత్యచేసుకుంది.  బుధవారం రాత్రి ముగ్గురి డెడ్​బాడీలను గ్రామానికి తరలించారు. ప్రవీణ్ పై ఆగ్రహంతో ఉన్న స్రవంతి బంధువులు, గ్రామస్తులు అతడి ఇంటి ముందే అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

అయినా పట్టువదలకుండా ప్రవీణ్ ఇంటి ముందే కార్తీక్‍, కౌశిక్‍  మృతదేహాలను పాతిపెట్టిన కుటుంబసభ్యులు, బంధువులు స్రవంతి మృతదేహానికి అతడి పంటపొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటిముందు ఖననం చేసిన డెడ్​బాడీలను గురువారం పోలీసులు తొలగించే అవకాశం ఉందన్న అనుమానంతో స్రవంతి బంధువులు, గ్రామస్తులు అక్కడే కాపుకాశారు. కానీ, అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.