V6 News

సీనియర్ ఐఏఎస్ కుమార్తె పెండ్లి ఖర్చులన్నీ కాళేశ్వరం కాంట్రాక్టర్ వే : హైకోర్టు

సీనియర్ ఐఏఎస్ కుమార్తె పెండ్లి ఖర్చులన్నీ కాళేశ్వరం కాంట్రాక్టర్ వే : హైకోర్టు
  • షెల్  కంపెనీల డబ్బుతోనే ఐదు రోజుల వివాహం    
  • నాలుగేండ్ల క్రితం మూడు నెలల్లో తేల్చుతామని నాటి సర్కారు పట్టించుకోలే
  • డీఓపీటీపై తీరుపై ఢిల్లీ హైకోర్టులో గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్
  • మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక సీనియర్  అధికారి క్విడ్ ప్రోకోతో కూతురు పెండ్లి ఘనంగా చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం  ప్రాజెక్టు కాంట్రాక్ట్  దక్కించుకున్న ముఖ్య కాంట్రాక్టర్​తో ఆ అధికారి లాలూచీ పడ్డారని నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్  గతంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహరాల శాఖ (డీఓపీటీ) కు ఫిర్యాదు చేశారు. డీఓపీటీ ఈ కంప్లైంట్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నాటి బీఆర్ఎస్  సర్కార్ కు సూచించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని శ్రీనివాస్  2022 సెప్టెంబరులో 99 పేజీల రిట్  పిటిషన్‌‌‌‌  దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను  మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్  తరపు అడ్వొకేట్  అక్షయ్ మాన్ వాదనలు వినిపిస్తూ.. కంప్లైంట్  చేసి నాలుగేండ్లు అయినా ఎలాంటి విచారణ జరగలేదని కోర్టుకు నివేదించారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్  ఐఏఎస్  అధికారి ఆ సమయంలో ఇరిగేషన్  శాఖ ముఖ్య ఆఫీసర్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్  కేటాయింపులో కీలక పాత్ర పోషించారు.

ఆ లాలూచీతో తన కూతురి వివాహాన్ని ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపారు. ఫలక్​నుమాతో పాటు హైదరాబాద్ లోని వివిధ ఫైవ్ స్టార్  హోటల్స్  లో ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఆ ఖర్చులను కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కాంట్రాక్టులు పొందిన ప్రముఖ కాంట్రాక్టర్  తన షెల్ కంపెనీల నుంచి చెల్లించారు” అని అడ్వొకేట్  వాదించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కోర్టుకు తెలిపిందని, కానీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదని నివేదించారు. కేంద్ర ప్రభుత్వం(డీఓపీటీ మంత్రిత్వ శాఖ) ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించామని 2022 అక్టోబర్ 12న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని గుర్తుచేశారు. మూడు నుంచి నాలుగు వారాల్లో అది ముగుస్తుందని అందులో పేర్కొన్నారని, నాలుగేండ్లయినా విచారణ ముగియలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ వాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ తరపు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కోర్టుకు నివేదించారు. మరోసారి ధర్మాసనం జోక్యం చేసుకొని బ్యూరోక్రాట్లపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కీలకమైన అధికారాలు ఉంటాయని గుర్తుచేసింది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ... పిటిషన్ పై విచారణ ముగించింది.