దేశంలో నాలుగుకు చేరిన మంకీపాక్స్ కేసులు

దేశంలో నాలుగుకు చేరిన మంకీపాక్స్ కేసులు

మంకీ పాక్స్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు కలవరపెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్‌ తొలి కేసు నమోదం కావడం ఆందోళనకు గురిచేస్తోంది. మంపాక్స్‌ సోకిన వ్యక్తికి ఎలాంటి విదేశీ ట్రావెల్‌ హిసర్టీ లేదు. అయినా అతడికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతకొన్ని రోజుల నుంచి అస్వస్థతకు గురికావడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేరళలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా..తాజాగా ఢిల్లీలో మరో కేసు బయటపడటంతో దేశంలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ముంబైలో కూడా ప్రతి వారం రెండు నుంచి మూడు అనుమానిత కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు.

మంకీపాక్స్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతిదగ్గర ఉండటం వల్ల ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్‌ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి ఎక్కువగా ఉంటాయి. వైరస్‌ లక్షణాలు బయటపడేందుకు 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుండి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఐదు మరణాలు సంభవించాయి.  ఒకదేశం నుంచి మరో దేశానికి పాకుతోన్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. వైరస్‌ బారిన పడతోన్న వారి సంఖ్య పెరుడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.