ఓటేసొస్తే.. డిస్కౌంట్లు, ఆఫర్లు .. రాయ్ పూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు

ఓటేసొస్తే.. డిస్కౌంట్లు, ఆఫర్లు ..  రాయ్ పూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు

 

  • హోటల్స్, హాస్పిటల్స్ బిల్లులు, సినిమా టికెట్లలో 1030% డిస్కౌంట్లు 
  • మార్కెట్లలోనూ కొనుగోళ్లపై 5-15% రాయితీల ప్రకటన

రాయ్ పూర్:  చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ఓటర్లకు వ్యాపారులు స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించారు. థర్డ్ ఫేజ్ లో మే 7వ తేదీన రాయ్ పూర్ లోక్ సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. దీంతో ఓటింగ్  శాతం పెరిగేలా ప్రోత్సాహకాలు అందించేందుకు సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటళ్లు, మల్టీప్లెక్స్ లు, మార్కెట్ల వారు ముందుకు వచ్చారు. ఓటర్లకు తాము అందించబోయే ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ఆఫీసుకు అందజేయగా, అధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మే 7వ తేదీన ఓటేసిన తర్వాత ఓటర్లు తమ చేతి వేలికి ఉండే సిరాను చూపించి ఈ డిస్కౌంట్లు, ఆఫర్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. ‘సబ్ కరే మతదాన్ (ప్రతి ఒక్కరూ ఓటేయండి)’ క్యాంపెయిన్ లో భాగంగా ప్రముఖ వ్యాపార సంస్థలు ఈ డిస్కౌంట్లు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవే..

ఓటేసి వచ్చినవారికి తాము మే 7 నుంచి 12 వరకు రూం బుకింగ్స్ పై 30%, మాక్ టైల్స్ పై 25%, ఫుడ్ ఆర్డర్స్ పై 20%, బఫే ఆర్డర్లపై 15% డిస్కౌంట్ ఇస్తామని హోటల్ బాబిలోన్ ఇన్ ప్రకటించింది. 
తాము కూడా మే 7 నుంచి 12 వరకూ మూడు బఫేలకు ఆర్డర్ ఇస్తే 30% డిస్కౌంట్, ఒక ఫ్రీ బఫే ఇస్తామని మేఫెయిర్ లేక్ రిసార్ట్ వెల్లడించింది. ఇతర హోటల్స్, రిసార్టులు, రెస్టారెంట్లు కూడా ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. మే 7న ఓటేసి వచ్చినవారికి సిటీలోని పీవీఆర్ మాల్ లో సినిమా టికెట్లపై 30% డిస్కౌంట్ ఇస్తామని ఆ మల్టీప్లెక్స్ ప్రకటించింది. ఇక సిటీలోని రామకృష్ణ కేర్ హాస్పిటల్ ఓటర్లకు, వారి కుటుంబసభ్యులకు హెల్త్ చెకప్ లపై 30% డిస్కౌంట్ ను అనౌన్స్ చేసింది. ఓపీడీ కన్సల్టేషన్లపై కూడా 30% రాయితీ ఇస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మే 7 నుంచి 12 వరకూ ఉంటుందని పేర్కొంది. 

అలాగే సంజీవని హాస్పిటల్ కూడా మే 7న ఓపీడీ కన్సల్టేషన్లపై 25%, మే 8 నుంచి 12 వరకు 50% డిస్కౌంట్ ప్రకటించింది. ఓటింగ్ రోజు ఓటేసి వచ్చిన వాళ్లు హాస్పిటల్ లో అడ్మిట్ అయితే ఆ రోజుకు రూం రెంట్ మినహాయింపు ఉంటుందని తెలిపింది. సిటీలోని బాలాజీ హాస్పిటల్ కూడా దాదాపు ఇలాంటి ఆఫర్లనే అనౌన్స్ చేసింది. అలాగే ఓటర్లకు చత్తీస్ గఢ్ ఫర్నీచర్ అసోసియేషన్ 10%, క్లాత్ ట్రేడర్లు 10%, రాయ్ పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15%, ప్లైవుడ్ అసోసియేషన్ 5% రాయితీలను ప్రకటించాయి. తాము గోల్డ్ మేకింగ్ చార్జీల్లో 15% డిస్కౌంట్ ఇస్తామని సరాఫ్ అసోసియేషన్ తెలిపింది. ఓటర్లకు తాము మే 8 నుంచి 3 వేల ప్యాకెట్ల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేస్తామని శ్రీరామ్ వోల్ సేల్ మార్కెట్ అనౌన్స్ చేసింది.