అమరావతి: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల మోసానికి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గంగా ప్రసాద్ కేశవరావ్, దినేష్, కిశోర్ కుమార్ ముగ్గురు తిరుమలలో భక్తులకు గదులు దొరకకపోవడాన్ని ఆసరాగా చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ ఆధార్ కార్డులతో తిరుమలలో రూములు బుక్ చేసేవారు.
అనంతరం ఆ గదులను TTD నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ రేటుకు భక్తులకు అమ్మేవారు. ఒక్కో గదిని సుమారు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్నారు. కొన్నిసార్లు ఒకే గదిని వేర్వేరు భక్తులకు ఇచ్చి మోసం చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల వీరి మోసపూరిత కార్యకలాపాలపై పక్కా సమాచారంతో పోలీసులు, TTD విజిలెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 20) నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో మరిన్నీ గదులు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు, TTD సెక్యూరిటీ సిబ్బంది కలిసి నిందితులను అరెస్ట్ చేశారు.
భక్తులు మోసాలకు గురికాకుండా ఉండటానికి టీటీడీ అధికారిక పోర్టల్ ttdevasthanams.ap.gov.in లేదా అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే సేవలు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫిర్యాదు చేయవచ్చు.
