తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం..వన్ మ్యాన్ కమిషన్ నియామకం

తిరుమల కల్తీ నెయ్యి  ఘటనలో కీలక పరిణామం..వన్ మ్యాన్ కమిషన్ నియామకం

తిరుమల కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఈ కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  కల్తీ నెయ్యి టెండర్ ప్రక్రియ, జరిగిన లోటు పాట్లకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఇటీవల ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. దీంతో ఈ అంశంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ సిట్ చార్జిషీట్ లో తేలిందని వైసీపీ అంటుంటే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు చార్జిషీట్లో తేలిందని కూటమి నేతలు అంటున్నారు.

మరో వైపు ఇవాళ ఏపీ శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టించింది. సెషన్స్ మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్ష వైసీపీ. ఈ అంశంపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా పలు మార్లు సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. శుక్రవారం ( ఫిబ్రవరి 20 ) సభలో మరోసారి గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంతో సభ హీటెక్కింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో.. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ సభలోకి వచ్చారు వైసీపీ సభ్యులు. వైసీపీ ఎమ్మెల్సీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్.