చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం (ఓపీఎస్) సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం స్టాలిన్, డీఎంకే ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ సీఎం స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం భేటీ కావడం.. డీఎంకే ప్రభుత్వాన్ని పొగడటం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్ డీఎంకేలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 20) సభకు హాజరైన తర్వాత పన్నీర్ సెల్వం తన కొడుకుతో పాటు వెళ్లి సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట స్టాలిన్, ఓపీఎస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఓపీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. స్టాలిన్ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని.. ఐదేళ్ల డీఎంకే పాలన బాగుందని కొనియాడారు.
వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. జయలలిత, ఎంజీఆర్ ఆశీస్సులతో మళ్లీ స్టాలినే సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నీర్ సెల్వం స్టాలిన్ పాలనను కొనియాడటంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా డీఎంకేనే విజయం సాధిస్తుందని చెప్పడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం సీఎం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడ్డాయి. పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, జయలలిత నెచ్చెలి శశికళ మూడు వర్గాలుగా అన్నాడీఎంకే చీలింది. మెజార్టీ ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపు ఉండటంతో అతడు సీఎం అయ్యాడు.
ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైంది. ఆ తర్వాత అన్నాడీఎంకేలో వర్గా విభేదాలు మరింత ముదిరాయి. దీంతో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గాన్ని అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఓపీఎస్ తిరిగి అన్నాడీఎంకేలో చేరేందుకు ప్రయత్నించగా అందుకు ఓపీఎస్ ససేమిరా అన్నాడు.
ఈ క్రమంలో పన్నీర్ సెల్వం డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌తో భేటీ కావడం, డీఎంకే పాలనను పొగడటం హాట్ టాపిక్‌గా మారింది. పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరబోతున్నారని.. దీనిపై చర్చించేందుకు సీఎం స్టాలిన్‌తో ఆయన భేటీ అయ్యారని తమిళ రాజకీయాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓపీఎస్ డీఎంకే తీర్థం పుచ్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల ముంగిట అన్నాడీఎంకేకు భారీ ఎదురు దెబ్బేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
