రిజర్వేషన్లు రద్దు చేస్తమని మేం అనలే: కిషన్ రెడ్డి

రిజర్వేషన్లు రద్దు చేస్తమని మేం అనలే: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్  నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తామెప్పుడూ అనలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్  అబద్ధాలు చెబితే చూస్తూ ఊరుకోబోమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్, రాణి రుద్రమ తదితరులతో కలిసి మీడియాతో కిషన్​రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్  పార్టీకే ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా రాష్ట్రంలో బీజేపీ డబుల్  డిజిట్  స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. 

బీజేపీ ఉనికి లేనిచోట కూడా తమ గ్రాఫ్  బాగా పెరిగిందని, ఇది తెలిసే కాంగ్రెస్  అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘‘బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిందే కాంగ్రెస్. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు కాంగ్రెస్  అన్యాయం చేసింది. సిద్దిపేటలో అమిత్ షా చేసిన ఉపన్యాసాన్ని కాంగ్రెస్  నేతలు మార్ఫింగ్  చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. ప్రచారంలో ఏం మాట్లాడాలో కూడా సీఎం రేవంత్  రెడ్డికి అర్థంకావడం లేదు. రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఆర్ఎస్ఎస్  నేత మోహన్  భాగవత్  అన్నారు. అంతేతప్ప వాటిని రద్దు చేయాలని ఆయన అనలేదు. కానీ, కాంగ్రెస్  నేతలు మాత్రం గోబెల్స్  ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్  రెడ్డికి కల వచ్చిందో లేక రాహుల్  గాంధీకి కల వచ్చిందో. వారి అజెండాను వారే వెల్లడిస్తున్నారు” అని కిషన్  పేర్కొన్నారు.

హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలి

సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేదా గద్దె దిగిపోవాలని కిషన్  రెడ్డి సవాల్  చేశారు. ‘‘సీఎం అయిన తర్వాత రేవంత్  నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పేగులు మెడలో వేసుకుంటా. కండ్లు పీకి బాల్  ఆడుకుంటా. చెడ్డీలు విప్పుతా అంటూ ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి” అని కిషన్  పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు కాంగ్రెస్  నేతలకు ఏ రకమైన అంశాలు కూడా దొరకడం లేదని, అందుకే వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చాలా తేడా ఉందన్నారు. కేంద్రంలో మోదీ పాలనపై ఇంత వరకూ ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని ఆయన చెప్పారు.