V6 News

ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య..దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన

ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య..దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన

సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని ‘కైలాశ్ హిల్స్'లో దారుణం జరిగింది. ఐఆర్​ఎస్ అధికారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. గతంలో వాళ్ల ఇంట్లో పనిచేసిన 19 ఏండ్ల రాహుల్ మీనా అనే యువకుడిని పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు.

న్యూఢిల్లీ: సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని 'కైలాశ్ హిల్స్'లో దారుణం చోటుచేసుకుంది. ఐఆర్​ఎస్ అధికారి కుమార్తె హత్యకు గురైంది. ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. 22 ఏండ్ల బాధితురాలు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు జిమ్‌‌‌‌కు వెళ్లగా.. ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఓ దుండగుడు లోపలికి ప్రవేశించాడు. యువతిపై దాడికి పాల్పడిన మొబైల్ ఛార్జర్ కేబుల్‌‌‌‌తో ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.

మాజీ పనిమనిషిపై అనుమానం..

ఈ కేసులో 19 ఏళ్ల రాహుల్ మీనా అనే యువకుడిని పోలీసులు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. 8 నెలల పాటు ఇంట్లో పనిచేసిన రాహుల్​ కిరాణా షాపు బిల్లుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నాడని గుర్తించిన కుటుంబం.. గత నెలలో అతడిని తొలగించింది. ఆ ఇంటి అలవాట్లు, కుటుంబ సభ్యుల సమయపాలనపై అతడికి పూర్తి అవగాహన ఉండడంతో పక్కా పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.