భారతీయ గోధుమలకు డిమాండ్

భారతీయ గోధుమలకు డిమాండ్

న్యూఢిల్లీ: ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి  గోధుమ పిండి, మైదా, సెమోలినా (సేమియా) ఎగుమతులను బ్యాన్​ చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీటిని విదేశాల్లో అమ్మడానికి పర్మిషన్లు ఇస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ) తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం గోధుమల ఎగుమతులను కూడా నిషేధించింది. డీజీఎఫ్​టీ నోటిఫికేషన్ ప్రకారం, గోధుమ లేదా మెస్లిన్ పిండి, మైదా, సెమోలినా, హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీల్ ఆటా ఎగుమతులపై నిషేధం ఉంటుంది.  సెమోలినాలో రవ్వ,  సిర్గి కూడా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యా,  ఉక్రెయిన్ దేశాలు గోధుమల ప్రధాన ఎగుమతిదారులు.  ప్రపంచ గోధుమ వ్యాపారంలో నాలుగింట ఒక వంతు వాటా వీటిదే. రెండు దేశాల మధ్య యుద్ధం  గోధుమ సరఫరాలో ఇబ్బందులకు  దారితీసింది. దీంతో భారతీయ గోధుమలకు డిమాండ్ పెరిగింది.

దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనూ గోధుమల, పిండి ధరలు పెరిగాయి. దేశానికి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మేలో గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది.  గోధుమ పిండికి విదేశీ మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. భారతదేశం నుంచి గోధుమ పిండి ఎగుమతులు 2021 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో (2021తో పోల్చితే) 200 శాతం పెరిగాయి. గోధుమ పిండి ఎగుమతిపై నిషేధం  విధించకూడదని ఇది వరకు ఒక విధానం ఉండేది.  ఆహార భద్రత కోసం ఈ మినహాయింపును ఉపసంహరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.  మనదేశం 2021–-22 ఆర్థిక సంవత్సరంలో 246 మిలియన్ డాలర్ల విలువైన గోధుమ పిండిని ఎగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-–జూన్ మధ్య కాలంలో ఎగుమతుల విలువ  128 మిలియన్​ డాలర్లు. కేంద్ర లెక్కల ప్రకారం  పోయిన ఏడాది ఆగస్టు 22 నాటికి కిలోకు రూ.25.41 ఉన్న గోధుమల సగటు రిటైల్ ధర ఆగస్టు 22 నాటికి 22 శాతం పెరిగి రూ.31.04 కి చేరుకుంది. గోధుమ పిండి సగటు రిటైల్ ధర కిలోకు రూ.30.04 నుంచి రూ.35.17కి 17 శాతం పెరిగింది. 2021-22 పంట సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 106.84 మిలియన్ టన్నులకు (దాదాపు 3 శాతం) తగ్గడంతో  గోధుమ ధరలు పెరిగాయి. వాతావరణం బాగాలేక పంజాబ్,  హర్యానాలో ఈ సారి దిగుబడులు తగ్గుతాయని అంచనా.