కుటుంబంలోని ప్రజాస్వామ్యం - సామాజిక పునాది. ఇళ్లలో పిల్లలపై భయం, శిక్ష, మౌనం, అవమానం ద్వారా అణచివేత మొదలవుతుంది. ఈ ఇంటిలోని నియంతృత్వమే రేపు సమాజంలో అధికార భక్తిని, పోలీస్ భయాన్ని, గుంపు బానిసత్వాన్ని పెంచుతుంది. ఇంట్లో ప్రజాస్వామ్యం లేకపోతే సమాజంలో ప్రజాస్వామ్యం ప్రతిబింబించదు. పిల్లలను నియంత్రించడం కాకుండా వారికి సరైన దిశ చూపడం సరైన మార్గం. ‘ఎందుకు?’ అని అడిగే ప్రశ్న అణచివేతకు శత్రువు.
ప్రశ్నలను అణచివేసే విద్య రేపటి బానిసలను తయారు చేస్తుంది. ప్రశ్నించే పిల్లలు రేపటి మార్పుకు విత్తనాలు. అందుకే టీచర్లు, తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలను భయపడకుండా స్వాగతించాలి. విద్యాభ్యాసంలో తప్పు చేయడం నేరం కాదు -అది నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగం. తప్పు చేసిన పిల్లలను శిక్షిస్తే వారు అబద్ధం నేర్చుకుంటారు. తప్పు మీద చర్చిస్తే పిల్లలు చైతన్యం నేర్చుకుంటారు.
కులం కంచెను కూల్చాలి
భారతీయ సమాజంలో పిల్లలను కులం పేరుతో విడదీయడం అతిపెద్ద హింస. పాఠశాలలు, ఇళ్లు కులరహితంగా మారాలి. పిల్లలకు తన కులం వల్ల గర్వం, మరో కులం వల్ల తక్కువతనం గానీ కలగకుండా పెంచడమే అసలైన శాస్త్రీయ దృక్పథం. పేద, బీసీ, దళిత, ఆదివాసీ పిల్లలకు స్కూల్ ఒక అవమాన స్థలం కాకూడదు. కుల వివక్షను పెంచే ఏ పాఠమైనా, ఏ ఆచారమైనా పిల్లల ఎదుగుదలకు శత్రువు. విద్య అంటే గౌరవం, సమానత్వానికి మార్గం కావాలి.
శ్రమతో అనుబంధం- సామాజిక స్పృహ కావాలి. విప్లవాత్మక విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, సమాజంలోని శ్రమను గౌరవించడం. పిల్లలకు చేతివృత్తులు, వ్యవసాయం, మట్టితో సంబంధం ఉండాలి. శ్రమను గౌరవించని చదువు బానిసత్వమే. పిల్లలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడే వాళ్లు శ్రమదోపిడీని గుర్తించగలరు. శ్రామిక వర్గం పట్ల గౌరవం పెంచుకోగలరు.
సామాజిక బాధ్యత
నేటి వ్యవస్థ నెంబర్ వన్ ర్యాంక్ కోసం పిల్లల మధ్య కృత్రిమ పోటీని పెంచుతోంది. విప్లవాత్మక దృక్పథంలో ‘నేను’ కంటే ‘మనం’ ముఖ్యం. పరీక్షలు, ర్యాంకులు పిల్లలను ఒంటరివాళ్లను చేస్తాయి. అందరూ కలిసి ఎదిగే 'సామూహిక జీవనం' ద్వారానే సామాజిక బాధ్యత పెరుగుతుంది. ప్రకృతితో ఐక్యత - పర్యావరణ చైతన్యం కలిగిస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ పిల్లల్ని కాంక్రీట్ గదులకే పరిమితం చేస్తోంది.
పర్యావరణ స్పృహ లేని చైతన్యం పరిపూర్ణం కాదు. ప్రకృతిని దోపిడీ చేసే వస్తువుగా కాకుండా దాంతో కలిసి జీవించడం విప్లవాత్మక విద్యలో భాగం కావాలి. డిజిటల్ యుగంలో స్క్రీన్లకు బందీ అవుతున్న పిల్లల స్వేచ్ఛను తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చాలి. లింగ సమానత్వం - పితృస్వామ్యానికి చరమగీతం లాంటిది. పిల్లలు లింగ సమానత్వం కేంద్రంగా ఎదిగినప్పుడే పరస్పర గౌరవం పెరిగి సమ సమాజం నిర్మితమవుతుంది.
ఆచరణాత్మక కార్యాచరణ
జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లోనో, చర్చల్లోనో ఉండకూడదు. అది పనిలో ప్రతిబింబించాలి. పిల్లలు కేవలం ప్రశ్నించడమే కాదు, తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న సామాజిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వారు క్రియాశీలక పౌరులుగా ఎదుగుతారు. దీనికి సమాజం ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించాలి.
ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లలను పాలించే అధికారులు కాదు. వాళ్లతోపాటు నడిచే మిత్రులు. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడగలిగినప్పుడే నిజమైన విద్య మొదలవుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పై నుంచి నియంత్రించే శక్తులుగా కాకుండా వారితో కలిసి ఆలోచించే, ఎదిగే మిత్రులుగా ఉండాలి. పిల్లలు స్వేచ్ఛగా ఎదిగినప్పుడే సమాజం మానవీయంగా మారుతుంది.
-పి. రేణుక భూంపల్లి, గెస్ట్ టీచర్, బీసీ గురుకుల పాఠశాల-
