ఏ మహిళకు కోటా? ఓబీసీ, బీసీ మహిళకు స్థానం ఎక్కడ..?

ఏ మహిళకు కోటా? ఓబీసీ,  బీసీ  మహిళకు స్థానం ఎక్కడ..?

విప్లవిస్తే విజయం.. ఉద్యమిస్తే ఉప్పెన అన్న శ్రీశ్రీ మాటలను గుర్తు చేసుకుంటూ మహిళా లోకం మరో పోరాటం సాగించాల్సిన సమయమిది.  మహిళల మధ్యే చిచ్చు పెడుతున్న చట్టాలు, ప్రభుత్వ విధానాలపై లోతుగా చర్చ జరగవలసిన సందర్భమిది.  చప్పట్ల మోత నడుమ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైతే  మీడియా సంబరపడింది. కానీ ఆ సంబరంలో ఒక ప్రశ్న నిశ్శబ్దంగా మూలనపడిందన్న  నిజాలనెవ్వరూ గుర్తించడం లేదు.  ఇంతకీ మహిళా కోటా  ఓకే  అవుతున్నందుకు సంతోషపడదామా...ఆ కోటాలో  ఓబీసీ,  బీసీ  మహిళకు స్థానం ఎక్కడా అని ప్రశ్నిద్దామా?  లేక పంచాయతీరాజ్, స్థానిక సంస్థల్లో మహిళల స్థానంలో బంధువులు,  మగవాళ్ల  పెత్తనంపై ఆందోళన చెందాలో అర్థం కావడం లేదు.  అందుకే మహిళా రిజర్వేషన్ చర్చ వేళ  సాధికారిత, అవకాశాలు, ప్రోత్సాహంపై  సమగ్ర చర్చ జరగవలవసి ఉన్నది. 

తెలంగాణలో  మొత్తం 3,35,27,925 మంది  ఓటర్లుంటే  రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా 2,26,246 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.  అంటే  తెలంగాణ రాజకీయాల్లో బీసీ మహిళ విచిత్రమైన స్థితిలో ఉంది. ఆమె ఓటు కావాలి,  కానీ ఆమె  నాయకత్వం వద్దు.  ఆమె ర్యాలీకి రావాలి,  కానీ వేదిక మీదకు రాకూడదు.  ఆమె పేరు జాబితాలో ఉండాలి,  కానీ నిర్ణయాలు ఆమె తీసుకోకూడదు.  2023 సెప్టెంబర్‌‌లో పార్లమెంటు ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియమ్ నిజంగా శక్తినిచ్చే చట్టమా,  లేదా  ఒక వర్గానికి మాత్రమే  మేలుచేసే  రాజకీయ పావా?  అన్న ప్రశ్న సుప్రీంకోర్టు నుంచి  గల్లీల వరకూ ప్రతిధ్వనిస్తోంది. మహిళా రిజర్వేషన్ శాస్త్రీయంగా ఎలా పని చేస్తుందన్న అంశంపై  అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 106వ  రాజ్యంగ సవరణ ప్రకారం 33% రిజర్వేషనతో అసెంబ్లీ/లోక్‌‌సభ సీట్లలో ఒక్కొక్కటి రొటేషన్ ఆధారంగా మహిళలకు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ,  ఎస్టీ  సబ్  కోటా ఉన్నా  బీసీ,  ఓబీసి  సబ్-కోటా లేదు.  దీంతో జనరల్ సీట్లలో అగ్రవర్గాలకు చెందిన మహిళలు మాత్రమే బరిలో ఉండే అవకాశమున్నది.  

  • తెలంగాణలో మహిళల సంఖ్య ఎక్కువ

భారతదేశంలో  బీసీలు జనాభాలో 40-–50% ఉన్నారు.  తెలంగాణలో  మహిళల సంఖ్య మరింత ఎక్కువ.  మున్నూరు కాపు, యాదవ, గౌడ్,  ముదిరాజ్,  పద్మశాలి, కురుమ, విశ్వబ్రాహ్మణతోపాటు ఎంబీసీ కులాలు రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.  కానీ ఈ వర్గాల మహిళలెవ్వరూ చట్టసభల్లో ఉండరు.  2023 ఎన్నికల్లో 119 స్థానాలకుగాను కేవలం 12మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. వీరిలో బీసీల నుంచి  వచ్చినవారు వేళ్లపై  లెక్కించదగినంత తక్కువ.  అంటే ఇది యాదృచ్ఛికమా  లేక  వ్యవస్థాగత వెలివేతనా అర్థంకాని పరిస్థితి. 2014 అసెంబ్లీ  ఎన్నికల్లో  విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ మహిళలకు కనీసం మంత్రి పదవి కేటాయించలేని దౌర్బాగ్య  పరిస్థితి.  2018  ఎన్నికల్లో  బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచినా  పోటీ చేసిన మహిళా అభ్యర్థులు చాలా తక్కువ.  గెలిచినవారిలో అధిక భాగం రెడ్డి, వెలమ వంటి ఆధిపత్య కుల నేపథ్యాల నుంచే వచ్చారు.

  • అన్ని రాష్ట్రాల గొంతు ఒక్కటే

ఓబీసీ  మహిళలకు  ప్రత్యేక ఉప కోటా లేకుండా ఈ చట్టం అసంపూర్ణమని 1996  నుంచి  చెప్తున్నారు.  గీత ముఖర్జీ కమిటీ,  జయంతి నటరాజన్ కమిటీ.. రెండూ ఓబీసీ  మహిళలకు  కోటాను  సిఫార్సు చేశాయి. కానీ ఆ సిఫార్సు ఇప్పటికీ  అమలుకాలేదు.  ప్రతిపక్షాలు ఈ బిల్లును ‘పోస్ట్ డేటెడ్ చెక్’ అని,  అమలు జరగని హామీగా అభివర్ణించాయి.  నియోజకవర్గాలు  ఇప్పటికే  2011 జనగణన ఆధారంగా గుర్తించడమైనది.  కొత్త డీలిమిటేషన్  కోసం వేచి చూడడం  అనవసరమని  విమర్శకులు పేర్కొంటున్నారు.  

ఓబీసీ  మహిళలకు,  మైనారిటీ  మహిళలకు ప్రాతినిధ్యం  ఎంత అనే  కీలకమైన ప్రశ్నలు  సంబరంలో  నిశ్శబ్దమయ్యాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాజకీయ పార్టీలన్నీ  బీసీ మహిళలను  సాధనంగా  చూస్తున్నాయే తప్ప శక్తిగా చూడడంలేదు.  మహిళా  రిజర్వేషన్  బిల్లును  ఒక  అవకాశంగా  పరిగణనలోకి తీసుకున్నా అందులో ఓబీసీ  ఉప కోటా లేకుండా,  డీలిమిటేషన్ అనే అడ్డంకి  ఉన్నంతవరకూ  తెలంగాణ బీసీ మహిళ రాజకీయ ప్రయాణం,   గమ్యం  కనపడని దారిలా మిగిలిపోతుంది.

  • తెలంగాణ నమూనా అవసరం

కులగణనలో  దేశంలో  ముందున్న  తెలంగాణ రాష్ట్రం మహిళా కోటా విషయంలో కూడా ఓ దిక్సూచిగా నిలవాల్సిన  అవసరం ఉన్నది. మొదటగా అసెంబ్లీ,  లోక్‌‌సభ  టికెట్ పంపిణీలో బీసీ మహిళలకు కనీసం 10% కేటాయింపు తప్పనిసరి చేయాలి.  ఇది చట్టపరంగాకాకపోయినా,  పార్టీ నిబంధనగా అమలు చేయవచ్చు.  రెండోది  బీసీ  కమిషన్‌‌ను బలోపేతం చేసి, మహిళా రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. మండల స్థాయి నుంచి నాయకులను తయారుచేయాలి.  మూడోది  పంచాయతీరాజ్ వ్యవస్థలో  ‘సర్పంచ్ పతి’ సమస్యకు  చట్టపరమైన  పరిష్కారం అవసరం.  మహిళా  ప్రతినిధి  స్వయంగా సంతకం చేయకుండా పత్రాలు ఆమోదించే నిబంధన తీసుకురావాలి. నాలుగోది.. తెలంగాణ అసెంబ్లీలో  బీసీ మహిళా ప్రాతినిధ్యంపై  శ్వేతపత్రం విడుదల చేయాలి.  డేటా బహిర్గతమైతే పార్టీలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.

- రేణుక గుంటిపల్లి
రాష్ట్ర కన్వీనర్,
మహిళా సర్పంచ్​ల ఫోరం

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.